కొనసాగింపు
తేది : 16-09-22
శీర్షిక : వారసత్వం ...
కవిత సంఖ్య : 988
ఆత్మీయతలతో అలరారుతూ
అనురాగాలతో తులతూగుతూ
అనుబంధాలను మూటగట్టుకుని
మురిసిపోతున్న పల్లె కుటుంబం మాది ....
పొదువుకున్న చక్కని చదువులతో
పొందిన సమాయానుకూల ఉద్యోగాలకు
కష్టాలన్నీ దాటుకుని హమ్మయ్య అని
నిర్మలంగా శ్వాస తీసుకుంటున్న కాలం ...
పొన్నపూలలాంటి పొగడ్తలతో
ఊరివారంతా ముంచెత్తుతూంటే
ఉబ్బి తబ్బిబ్బుల ఉప్పొంగి పోయే వాళ్ళం ...
కష్టాల కడలిని ఈదిన అమ్మానాన్నలు
కూడా చెట్టునీడన సేద దీరినట్టుగ…
మేము దూరమున్నామన్న బాధతో సహా
అంతా మరిచిపోయి మురిసిపోయేవాళ్లు ....
పెరిగి పెద్దయి చెట్టుకో పిట్టలాగా
నలుగురం నాలుగు చోట్ల నివాసం ...
పాయలు విడిపోయిన నది పరుగులా
ఉద్యోగాలలో స్థిరపడి పిల్లా పాపలతో ..
వాళ్ళ చదువులతో కుస్తీలు పడుతూ
కడుపులో చల్ల కదలకుండా
కాలం కదిలిపోతూ ఉంది ...
ఎక్కడున్నా ...రెక్కలు కట్టుకుని
వాలిపోయె వారమంతా ఇంటికి….
మాఘ శుద్ధ ఏకాదశికి బంధుమిత్ర
సపరివారంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ
స్వామి వారి పూజ కోలాహాలంగా
జరుపుకునే వారం దాదాపు రెండు
దశాబ్దాల పాటు....
అమ్మానాన్నలను జీవ నదిలా
నవ్విస్తూ సంతోషాలు పంచుతూ …
చిన్నా పెద్ద సంబరాలను కూడా
జత చేస్తూ అమ్మా నాన్నల ఆనందాలను
ద్విగుణీకృతం చేయాలనే సంకల్పంతో ...
వాళ్ళ ఎనభైల్లో కూడా అమ్మింటిలోనే
అందరం కలుసుకోవాలనే నిర్ణయంతో
ఆటుపోట్లు లేని నావలా సాగిపోయింది ...
ఆట పాటలతో సాగిపోతున్న జీవితాలకు...
ఉన్నట్టుండి చిన్న కుదుపే ....
ఒక్కసారిగా ...ఆ క్షణం నుండి
ఎంతో బాధ్యతగా... చెప్పలేనంత
బరువు మోస్తున్న చందంగా అనిపించింది ....
అప్పటి వరకు అన్నీ చూసుకుంటున్న
అమ్మా నాన్నలు ఉన్నట్టుండి
ఒకరోజు పిలిపించుకుని....ఒకటొకటిగా
వివరాలిస్తూ ... తెలియపరుస్తుంటే ....
ఎంతో ఉద్విగ్నానికి లోనయ్యాం ....
వారసత్వంగా వస్తున్న నిత్య పూజలోని
దేవతా విగ్రహాలు మా చేతి కందించి ...
ఇకనుండి ఈ బాధ్యత ఇంటి మర్యాద
మీదే నంటూంటే ... ఒక్కసారిగా
గుండె బరువెక్కి ...పిండినట్టయి
చెప్పలేని భారమైన ఆలోచనలతో
వారి ఆజ్ఞలను శిరసా వహిస్తూ
ముందుకు కదిలి పోయాం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment