మారని పొద్దు
శీర్షిక: కర్షకుడి కార్మికుడి బ్రతుకు పొద్దు…
కవిత సంఖ్య : 157
నాగరికతలతో నడకలు నేర్చి
పారిశ్రామికతలతో పరుగులు పెట్టి
సాంకేతికతల సొబగులద్దుకుని
గ్రహాంతరాలకు పయనమౌతున్నాడు ...
రాజుల రోజులు పోయి
రాజ్యాల రూపు రేఖలు మారినా
రాళ్లు రప్పలు మోసే
కూలీల బ్రతుకులు మారేనా...
జాగీరులు చేవ చచ్చి
జమిందారీ పద్ధతులు మారినా
జగమెరిగిన కష్టజీవి
కర్షకుని బ్రతుకు మారేనా....
సామ్యవాదం పేరు చెప్పి
ప్రజాస్వామ్యం నెలకొల్పినా
సాగుతుందా సగటు శ్రామికుని
బ్రతుకు దెరువు సజావుగా...
కమ్యూనిజం కుప్పకూలి
కామాందులు మారిపోయినా
రెక్కాడితే గాని డొక్కాడని
బక్కోడి అసలు బ్రతుకు మారేనా...
రాజరికం, ఫెడరలిజం,
జాగీర్దారీ, జమిందారీ,
సామ్యవాదం, ప్రజాస్వామ్యం,
కమ్యూనిజం, కాపిటలిజమ్.....
పేరేదైనా, రాజ్యమేదైనా మారనిదొక్కటే
కర్షకుడి కార్మికుడి బ్రతుకు పొద్దు…
పదే పదే దోపిడీకి గురౌతున్నరనేదే
అందరికి తెలిసిన అంతిమ పరమ సత్యం......
రాజ్యాంగాలెన్ని మార్చినా,
చట్టాలెన్ని తెచ్చినా నిరుపయోగమే
వ్యవసాయంలో కర్షకునికి,
వాణిజ్యం లో కార్మికునికి
సరైన వాటాలు దక్కనిదే .......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment