Monday, October 4, 2021

వెన్నెల మాటున తేదీ : 11-08-2021 శీర్షిక : వేచిన ఖడ్గం

 వెన్నెల మాటున 

తేదీ  : 11-08-2021
శీర్షిక : వేచిన ఖడ్గం 
కవిత సంఖ్య : 725

డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్రం 
స్వావలంబన పొందని సామ్రాజ్యం 
మెతుకు మెతుక్కు.. బతుకు బతుక్కు 
వెదుక్కునే పొంతన లేని విధానాలు .... 

గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదో ఒక 
నాయకత్వం ... ఎరువేయని రాజకీయ 
పంటై ... పచ్చ పచ్చగా చిగురులేస్తూ ... 
ప్రతివారిని పురి కొల్పినా ... పక్కాగా 
ప్రజానాయకులకు చిరునామా గల్లంతు .... 

నిప్పుల మీద నీళ్లు చల్లిన విధంగా 
సంక్షేమ పథకాల చిలకరింపులు ... 
మొక్కలు తరువులవ్వని విధమైన  
హారిత హారాల ముచ్చట్లు .... 
చిగురేయ్యవు.... వేసినా పన్ను 
కరెంటోళ్లు కత్రిస్తానే ఉంటారు ..... 

మసాలాలతో మంత్రించిన మేనిఫెస్టోలు 
వెన్నెలకన్నా చల్లదనమున్న పలుకులు 
కలిపి నోట్లో పెట్టిన వెన్నముద్దల చందం 
మరీచికలై పరాచికాలాడుతున్న బతుకులు... 

సగటు మనుషుల బతుకులన్నీ 
వెన్నెల మాటున వేచిన ఖడ్గాలకు 
బలవుతూనే ఉన్నాయి. 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment