Thursday, October 21, 2021

చిత్ర కవిత తేది: 09-07-2021 శీర్షిక : రైతు బతుకు

 చిత్ర కవిత 

తేది: 09-07-2021
శీర్షిక : రైతు బతుకు 
కవిత సంఖ్య : 35

బార్టర్ బతుకుల కాలం నుండి 
బండి లాగుతున్న పల్లె సంత 
కాల మార్పులతో కదిలిపోతున్న 
కాలం చెల్లిన ఆత్మీయతల సంత ... 

ఒకప్పుడు చుట్టూ పది ఊర్లకు 
ఉపయోగపడే ఊరి సంత .... 
నేడది పట్టణాలకు పాకినా 
పల్లెనుండి సరుకులొస్తేనే... 

దమ్మిడీకి కొరగాని దళారులకు 
కొని అమ్మితే చాలు లాభాలే లాభాలు ... 
చేతినిండా పని.. జేబునిండా డబ్బు ... 
రైతు కష్టం దండగ  ... వినియోగదారు 
కడుపు నింపదు .... 

కార్మికులు రక్తం చిందించి 
చమట చుక్కలు కారిస్తే వచ్చిన 
వస్తువు ... రంగు కాగితాలు కప్పుకుని 
వాతానుకూల యంత్రాల ముంగిళ్ళలో  
వస్తువుల  ధరలు నింగిలో ఉంటాయి .... 

కాయ కష్టం చేసి కడుపు నింపే 
రైతన్న పంటలు ఎండా వానలకు 
తడుస్తూ... ఎతలన్నీ జత చేసుకుని 
ఎక్కిరింపులు ....పరిహాసాల పందిరే  కిందనే  .... 

కపట పాలకులెప్పుడు  కరుణిస్తారో 
మద్దతు ధరల మాట నీళ్ల మూటలు 
ఎండా , వాన  చలి  ఏదైనా సరే .... 
రైతు బతుకెప్పుడూ  దిన దిన గండమే...... 
 
రాజుల రోజులు పోయి రాజ్యాలు 
మారినా .... దండుకునే దళారీలదే 
పైచేయి ఏనాడైనా .... నోముకున్నోడి 
ప్రసాదం నోచుకున్నోడు తిన్నట్టు ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment