Thursday, October 14, 2021

పంచదార పలుకులు తేది : 27-08-2021 శీర్షిక : మధుర సుధలే ....

 పంచదార పలుకులు

తేది : 27-08-2021
శీర్షిక :  మధుర సుధలే .... 
కవిత సంఖ్య : 739

ప్రేమలో కూరుకుపోయిన 
జంటలకు నిద్దరే రాని పొద్దెరుగనితనమే 
ఒకరి మాట ఇంకొకరికి చక్కెరవెయ్యని 
చిక్కని తీయనైన  మధుర వంటకాలే  ..... 
 
నూతనమున వధూవరులకు 
ఎడతెరిపిలేని ఎన్ని ముచ్చటైనా 
ఒయాసిస్సులను  తలపించే 
తేట తెల్లపు చెలిమెల నీటిమూటలే .... 

బుడి బుడి అడుగుల పరుగెడ్తూ 
బుల్లి బుల్లి మాటల ఊకొడుతూ 
బోసినవ్వుల కన్నయ్యల మాటలు 
తేనెలూరించే కమ్మని ఖర్జూరాలే  .... 

పెద్దలు చెప్పే బ్రతుకు పాఠాలు 
భరోసానిచ్చే గుండె నిబ్బరాలు 
మంచిని బోధించే సుద్దిబుద్దులు 
ప్రవచనాల పంచదార పలుకులే ..... 

రస రమ్యమైన రాచ కావ్యంగా 
రాణించాలంటే..... 
చమత్కారముల చక్కిలిగింతల 
రంగరింపులతో .... 

వైవిధ్యాలనొలకబోసే శీర్షికలతో 
చెరుకుగడలాంటి చక్కటి ఎత్తుగడలతో ... 
పళ్లరసాల్లాంటి పదబంధాలతో 
పండంటి శోభలను పదిలపరుస్తూ... 
 
కలకండలాంటి కమ్మని భావాల పంటతో 
నూతనత్వాల సృజన శిల్పంతో 
అనంతమైన అంశాలను  భర్తీ చేస్తూ 
సహజసిద్ధమైన సందర్భాలతో ... 
మల్లెతీగలా అల్లుకునే అర్హమైన 
అందమైన సుందర భావాలతో ... 

అర్థవంతమైన ముగింపులతో 
ముడివేసుకున్న....  చేయి తిరిగిన 
సాహిత్యకారుని కవితాపుష్పం కూడా
అచ్చెరువొందించు అలవోకగా 
పంచదార పలుకులై .....

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment