Monday, October 4, 2021

బోనాలు…. 02-08-2021 శీర్షిక: ఆదిశక్తి పూజలు…

 బోనాలు…. 

తేది: 02-08-2021
శీర్షిక: ఆదిశక్తి పూజలు… 
కవిత సంఖ్య : 717

పరవశించిన ప్రకృతమ్మ ఒడిన 
తొలకరితో పలుకరించే తొంబై తొమ్మిది
రకాల అనారోగ్య కారకాలను అరికట్ట..
తొణకకుండ తోడుతనే నివారించె పూర్వీకులు… 

అనుభవాల సారాలను మేళవించుకుని 
కాలమాన పరిస్థితులను కలగలుపుకుని 
శుచి శుభ్రతల మల్లెలను ముల్లె కట్టుకుని
ఆరోగ్యాల సంపదలు పదిలపరుచుకొనంగ…
ఆర్యులు ఏర్పరిచిరి ఆచార సంప్రదాయాలు ... 

పసుపు పారాణీలు రాసుకుని పడుతులంతా 
మడికట్టుకుని పసుపు కుంకుమలతో..కొత్తకుండ 
పూదించుకుని బొనమెత్తి..పైన దీపం పెట్టుకుని 
పాణంగా అడుగులేస్తూ పరవశించి పోతారు….. 
అమ్మవార్లకు అర్పించి సేద దీరుతారు….. 

ఆదిశక్తి అవతారాలైన …గోల్కొండ బల్కంపేట 
ఎల్లమ్మ తల్లులు, ఉజ్జయిని మహంకాళి, 
చిలకలగూడ మైసమ్మలు, హరి బౌలి అక్కన్న 
మాదన్నల  మహంకాళి, లాల్ దర్వాజ మాతేశ్వరి,
శాలిబండ ముత్యాలమ్మలకు….. 

తొట్టెలు, ఘటాలు, రంగం, బోనం, గావులు
అమ్మకు అర్పించే ఆదరణీయమైన మొక్కులు 
శతాబ్దాల చరిత కలిగిన తెలంగాణ పండగ 
జరుపుకొనిరి జనులంత మనసంతా నిండగా…. 

ఆషాఢమాసమంటేనే అమ్మలకు 
ప్రీతిపాత్రమటంచు ఆధ్యాత్మికతలను 
జోడించి అందిపుచ్చుకొనిరి ఆరోగ్యాలను.... 

No comments:

Post a Comment