గోకులాష్టమి
తేది: 31-08-2021
శీర్షిక: కన్నయ్య ...
కవిత సంఖ్య : 742
కరుకు రక్కసుల నడుమ
కఠిన పాషాణపు చెరసాలలో
కన్ను విచ్చుకున్న నీ మోము
తలచి కంట నీరే కదా కన్నవారికి ....
మధురలోన జన్మించిన
దేవకీవసుదేవుల కన్నబిడ్డ
గోకులంలో పెరిగి పెద్దయిన
నందయశోదమ్మల గారాలపట్టి ....
అల్లరి కృష్ణయ్య నీ చిలిపి చేష్టల
గోపెమ్మలను ఆట పట్టించినా
అచ్యుతుడన్న అవ్యాజమైన ప్రేమే
కదా గోకులములోన అందరికి ....
ముప్పులెన్ని పొంచి ఉన్నా
ఎప్పటికప్పుడు తప్పక వచ్చే తిప్పళ్లని
ముసి ముసి నవ్వులతోనే తప్పిస్తూ
తోటి వారిని కాచిన కృష్ణయ్య ....
మన్ను తిన్నాడన్న ఫిర్యాదుతో
మందలించిన యశోదమ్మకు
మాయ చేసి మహీతలమును
భువన బాండములను చూపగ
మదిన మేము మురిసితిమయ్యా .. ....
కాళీయ మర్దనం గావించి
గోవర్ధనమునెత్తి గోపాలుర కాచి
ఇంద్ర గర్వ భంగము గావించి
ఇల వరుసలో కంస చాణూర సంహారములు
కావించి ... కన్నవారి శృంఖలాలు
బాపగ .... కళ్ళు చెమర్చితిమి ......
అష్టభార్యలను ఇష్టసఖులుగా
పొందినా ... పదహారు వేల మంది
గోపికల మదులు దోచిన
అమలిన శృంగార రసజ్ఞుడిని
తలచి మనమున ఆనందించితిమి .....
కురు సంగ్రామమున పాండవుల
పక్షమున నిలిచి... ధర్మమునకెపుడు
దాపుగానిలిచిన దాఖలాలు కని
దర్శన భాగ్యము కొరకై ప్రతి ఏట
నీ పూజలే కదా కన్నయ్యా .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment