స్వప్న కుసుమాలు
తేది : 17-08-2021
శీర్షిక : జారుకుంటున్న కుసుమాలే…..
కవిత సంఖ్య : 731
నిశీధి మధ్యలో నింగిన చుక్కలా
అర్దరాత్రి స్వాతంత్య్రం వచ్చినందుకో
ఏమో .....
మగత నిద్రలోని కలలన్నీ
మరు రోజు ఉదయాత్పూర్వానికే
జారుకుంటున్న కుసుమాలే .....
కోట్ల మంది తపస్సులు చేసి
లక్షల మంది తమ తనువులర్పిస్తే
వేల మందికి గుర్తింపొచ్చినా
కొంతమందికే పట్టం కట్టారు ......
బీజం అక్కడే పడిందేమో ......
రాను రాను రాజుగారి గుర్రం ... లా
ప్రాయోజితాలకే పరువులు కుదువ
పెట్టుకుంటూ ... పూటకో రంగు చొక్కా
మారుస్తూ....విలువల వలువలు జారవిడుస్తూ
ముందు తరం భావి నాయకులైన
అనుచరగణాలకు ఏమి సూచనలిస్తున్నట్టు .....
పవిత్ర ప్రజానాయకులమన్న స్పృహలు
కోల్పోతున్న కొంత మంది పాలకులు
ప్రజలింకా నిరక్షరాస్యత నీడలలో
మగ్గుతున్నారన్న భ్రమలలో బతికేస్తున్నారు ....
ఉమ్మడి ఆస్తులను ఉపాహారాలలా
ఊడ్చి పెడుతూ తమ వందిమాగదులకు
నిస్సిగ్గుల నిజస్వరూపాలను తమంత
తామే బహిర్గత కారకులౌతున్నారు .....
కడు చిన్న ఉపాధికైనా కనీస
విద్యార్హతలు విధించుకున్న మనమే
కక్ష గట్టినట్టు లక్షలు కుమ్మరించి ...
సంక్షేమాల చిరునామాల ముద్రలేసినంత
మాత్రాన .... మాయమౌతుందా ఆర్ధిక
అంతరం ......
స్వార్థాలను సాథ్ లగేజీలా కాకుండా
ఇగురంగా
ఇరుగు పొరుగు క్షేమాలను
సమతూకం చేయగల సత్తా సమకూర్చి
సంపన్నం చేయడమే సరయిన పద్ధతి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment