రెప్పలు మోయని దుఃఖం
తేది: 02-09-2021
శీర్షిక : మనసు దర్పణాలు
కవితసంఖ్య : 744
లెక్క తేలనన్ని సార్లు తెరిచి మూసుకున్నా
పక్కాగా చేసిపెడతాయి వాటి పని అవి
ఊహించలేని పరిణామాలను సైతం
ఊహకందని రీతిన ఒంటి చేత్తో
ఎదుర్కునే సైనికులవి ....
నమ్మకానికి అమ్మ లాంటివి…
దేహ దేశానికి రాణా ప్రతాప్ సింహులు
కంటి వాకిలికి బోడో గుర్ఖాలు
ఎంతటి బలశాలికైనా గర్వభంగమే
వాటి కార్యదక్షత ముందు .....
పరితపించే గుండె లయలకు
స్పందించే మనసు తోడైతే
కను రెప్పల మత్తళ్లను దాటిపోయే
కంటి ఊటలకు కరువే ఉండదు …
ఆనందాల కబుర్లకైనా
అపాయాల ముచ్చట్లయినా
కరువుదీర.... వర్షాలు పడినప్పటి
చెరువు మత్తళ్లయిపోతాయి .....
గుండెలు చెరువులై ఉప్పొంగితే
తలుపులు బార్ల తెరుచుకుని
బరువులు దింపే బంట్రోతులు
మనస్సులో ప్రభవించే కల్లోలాలకు
కకావికలాలకు కనపడే దర్పణాలు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment