Saturday, August 14, 2021

సూక్తి కవిత

 *అవసరం లేని వస్తువులు ఇంటికి, 

ఆకలి లేనపుడు తినే తిండి ఒంటికి, 

సంబంధం లేని మనుషుల గురించిన 

ఆలోచనలు మనసుకి హానికరం.......!!*


సూక్తి  కవిత 

అదేంటో గాని చెడు విషయాలు
చేరినంత వేగంగా.. ప్రభావితం
చేసినంత త్వరగా మంచి విషయం 
మనసుకు హత్తుకోదు చిత్తమున కెక్కదు.... 

ఉరుకుల పరుగుల జీవితాలకు 
ఉడకేసుకొని తినే తీరికలు లేక 
ఒళ్ళు వంచే పనుల ఊసులు లేక 
సమయా సమయాలు మరిచి పోయి...

సందె పొద్దులో..అర్ధరాత్రి ఆలస్యపు 
విందులో ఆరగిస్తూ మొద్దునిద్రల 
అలుపు సొలుపులు తీర్చుకుంటూ 
అమృతఘడియలు ఆవలకు విసిరేసి
రెండును ఒకటిగా చేసుకుని  *బ్రంచులు*
కావిస్తూ బలి చేసుకుంటున్నారు ఆరోగ్యాలు.... 

కార్పొరేట్ కామర్సుల కను సన్నలలో 
ఒకటి కొంటే రెండోది ఉచితమనే
ఊదరగొట్టే వ్యాపార ప్రకటనలతో 
ఊపిరాడనీయరు మధ్యతరగతికి 
ఊడ్చి పెట్టేంతవరకు నిండు జేబులు.... 

అతి సర్వత్ర వర్జయేత్ అన్న చందంగా 
ఇంటికి అక్కరలేని సామానులయినా... 
వంటికి అవసరం లేని భోజనమయినా 
మనసుకు కష్టమయ్యే మనుషులయినా... 

విసర్జించుటే సర్వత్రా వినమ్రమం....  
విలువైనవి దక్కించుకోవచ్చు 
ఆర్థికంగా..ఆరోగ్యకారకంగా..అభివృద్దే ... 
మానసికంగా ... ఉల్లాసంగా .....మంచిని  
సాధించుకోవచ్చు......  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment