తొలకరి చినుకులు.
తేది: 12-06-2021
శీర్షిక: జీవరాశి సంక్షేమం
కవిత సంఖ్య : 134
కొలువ లేని అనంత విశ్వంలో వింతే
కొలువైన మన పాలపుంత కొంత
సౌరకుటుంబపు సూర్య చంద్రులు
సుక్కలు నిండిన అంబర సంబరం ..... అన్నీ
కాలగమన భ్రమణంలో
కదులుతున్న కాల రేఖలు
ఆయనాలు ఋతువులుగా ధాతువులై
అక్కరలు తీర్చే అపర ఔషధాలు ....
భీకర గ్రీష్మ తాపాల
భీతిల్లు పర్యావరణాల
బీటలు వారిన భూజాత
ఆవురావురుమని అర్రులు చాచు ....
సంద్రపు నీటిని సంగ్రహించిన
గగనము సవారీ చేయు.. సరి చేయ
మేఘమై గర్జించి వర్షించు.. తొలకరి చినుకై
అవని తనువును అందంగా ముద్దాడ ....
రెప్ప పాటులో రెప రెపలాడు
పచ్చ పచ్చని తివాచీలు పరుచుకుని
పల్లవించును భూజాత ప్రసన్నతలు
ప్రస్ఫుటించు జీవరాశి సంక్షేమాలకై ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment