తెలియని వ్యధ
తేది: 18-05-2021
శీర్షిక: అంతుపట్టని మనో వ్యధ
కవిత సంఖ్య: 128
రంగులు పులుముకున్న అంతర్జాతీయ
రాజకీయ క్రీడకు ఏడాదిగా కుస్తీలు పడుతూ
కనపడని క్రిమి కాటుకు కకావికలమై
బలిపీఠమెక్కుతున్న ప్రజానీకం ....
ఉరుముల మెరుపుల ఝళిపిస్తూ
పట్టినట్టే గట్టిగా పట్టుకుని ఒక్కసారిగ
గేట్లు తీసిన వరద నీటి ఉధృతిలా
చిత్తుగా వదిలేసిన ప్రభుత్వాలు ....
స్వంత ప్రాణాలపై పట్టింపులు లేక
అవగాహన కొరతలతో అవతలి వారి
అసువులు కూడా తీస్తున్న ఆకతాయిల
అకృత్యాలతో విసిగిన అధికారం లేని విజ్ఞులు ....
ఆసుపత్రులే తెరిచిన గుళ్ళనుకుని
ప్రదక్షిణలు చేస్తున్న ప్రజాసమూహాలు
అసువుల కొనఊపిరి అస్త్రం మందులు
ప్రాణవాయువులై పరుగెత్తిస్తుంటే...
కాంతివిహీనమై వేలాడేసుకున్న
కనురెప్పల చాటున దాగిన నేత్రాల
కంటి గోళాలకు పొరలు కమ్మి దిమ్మ
తిరిగి దిగాలవుతున్న బొమ్మలవుతుంటే
అంతుపట్టని మనో వ్యధలే మిగులుతుండె....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment