Saturday, August 14, 2021

ఆకు పచ్చని లోయ తేది: 02-06-2021

 ఆకు పచ్చని లోయ 

తేది: 02-06-2021
శీర్షిక: అందాల కాశ్మీరమే ... 
కవిత సంఖ్య: 678

వెండి కొండల పైన భానుడు 
వర్షించే పైడి కాంతుల పరదాలలో
మంచు ముత్యాలు దొర్లించుకుంటూ
పాయలుగా సాగి సెలయేళ్ళుగా మారి
జాలు వారే జలపాతాల హోరులు .... 

గిరులన్నీ తరువులతో అల్లుకుని
పచ్చల హారాలు పొదిగిన ఆభరణంలా
నింగినంటే బారు వృక్షాల రేఖలతో 
పచ్చ తివాచీలు పరుచుకున్న భూదేవి....

సహజ సుందరమైన సరస్సులతో
అపార వనమూలికల ఓషధులు నిండి
సప్తవర్ణాల కుసుమ పరిమళాలు అద్దుకుని
మూటగట్టుకున్న ముద్దైన పొత్తిళ్ళు..... 

కాలుష్య కోరలకందని కమనీయపు 
మంచు కొండల మల్లెల పాదాలు 
స్వచ్ఛమైన ఫల పుష్పాల సానువులు 
ప్రకృతికే కన్నుకుట్టే స్వచ్చ పరిసరాలు  .... 

ఆసేతు హిమాచలం అందాల 
ఆకు పచ్చని లోయలెన్నున్నా 
ప్రతి భారతీయుని కళ్ళల్లో మెదిలే 
కాంతిరేఖ మాత్రం అందాల కాశ్మీరమే ... 

నగునూరి రాజన్న
కరినగరము.  

No comments:

Post a Comment