Tuesday, August 3, 2021

జీవన గమనం తేది: 27-04-2021

 జీవన గమనం 

తేది: 27-04-2021
శీర్షిక : బతుకు గమనం
కవిత సంఖ్య : 16 

పల్లె జమిందారీల నీడల్లో కదిలిన 
భయాల బతుకుల ఆనవాళ్లు... 
అప్పుడప్పుడే అంతమై పల్లెకు 
చేరని స్వాతంత్య్రం చిరునామాలు ... 

కథలు కథలుగా పెద్దల అనుభవాలు 
గద్దెలమీద విన్నప్పుడల్లా ... 
బాల్యపు గుబులు బలాదూరుగా 
చేతులు చాపి బంధిస్తుండేది .... 

అప్పుడప్పుడొచ్చిపోయే 
పండగలు పబ్బాలు బంధు 
మిత్రుల్లాంటి ఆనందాల నీడల్లో
పది అయిపోయి పట్నం బాట పట్టినంక  
ఇక వెనక్కి తిరిగి సూసుకోలే ... 

నల్లెరు మీద నడకలా 
నవరత్న నుండి మహారత్నగా మారి 
మరకత శోభలు సంతరించుకున్న 
కంపెనీలో కాలుకు మట్టంటకుంట
సల్లగా సాగిపోయింది నలుబదేండ్లు... 

ఇక ఇప్పుడే అసలు కథ మొదలైంది
నలుబదేండ్లు మరో ప్రపంచంలో 
బతికి  బట్టకట్టి ... ఒక్కసారిగా 
రెక్కలు విచ్చుకుని అసలు  ప్రపంచంలో 
బతుకు నేర్చుకుంటూ బయలుదేరాము... 

బండ్లు ఓడలయి ఓడలు బండ్లయి 
ఏ దారి ఎటుపోతుందో తెలియని 
భవిష్తతుకై ... భయాలు వీడిన 
బతుకు గమనం కోసం బరాబరిగా  
బాట సాగించాల్సిందే ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment