ఆశావాదం ...
శీర్షిక : గట్టి నమ్మకం
తేది: 12-05-2021
కవిత సంఖ్య: 122
వర్షానికి ఊరంతా తడిసిపోయిన
చిత్తడి నేలలా వార్త పత్రికలనిండా
కరోనా వార్తలే .... ఏ చానల్
తిప్పినా టి వి నిండా ఘోరాలే....
తప్పు చేయని నేరస్తులకు శిక్షల
అమలులా... కోర్టుల్లో నిలిచిన కేసుల
పెండింగుల్లా ...ఏ ఆసుపత్రి ముందయినా
రోగుల వాహనాల బారులు ....
సునామీ బాధితుల వరుసల్లా
పడకలు దొరక్క కొంతమంది
మందులు దొరక్క ఇంకొంత మంది
ప్రాణవాయువుల పోరాటం కొందరిది...
అందరూ అందరికి వేలు
విడిచిన బంధువులై పోతున్నారు
ఆపదలో ఆదుకునే నాథుడే
కరువై ...హలో లక్ష్మణా అంటూ ...
చీకటి వెలుగుల్లా కష్ట సుఖాలు
జంట పక్షులే..ఒకదాని తర్వాత
ఒకటి వస్తూనే ఉంటాయి... నేటి
సూర్యాస్తమయం తదుపరి రేపటి
సూర్యోదయంలా .....
నిస్పృహలు నిలువునా అల్లుకున్నా
ఆశలన్ని మిణుగురుల రూపంలో
అంటుకునే ఉన్నాయి... అనుభవాల
పాఠంలా... మంచి రోజు తప్పక వస్తుందనే
గట్టి నమ్మకం....ఆశాభావంతో
ఎదురుచూస్తున్న విశ్వ మానవాళి....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment