Saturday, August 14, 2021

గెలుపు సోపానం తేది: 31-05-2021

 గెలుపు సోపానం 

తేది: 31-05-2021
శీర్షిక : అలుపు లేని పోరాటం
కవిత సంఖ్య : 29

అందరు బాగుండాలి 
అందులో నేనుండాలంటూ చేసే
అలుపు లేని పోరాటములే
అసలు గెలుపుకు సోపానం.. 

అనుభవాల తోటలలో విహరించి
స్వార్థమెరుగని సంకల్పాలను శ్వాసిస్తూ
నీతి తప్పని నియమాల తోరణాలను
అక్కున చేర్చుకుని సదా ఆచరిస్తూ .... 

ఆత్మ విశ్వాసాల అమ్ముల పొదిలో 
లక్ష్యపు అడుగుల తూణీరాలను 
బంగరు భవిష్యతుల కాంతులనద్ది  
అందమైన పరిమళాలు ఆస్వాదించడమే....

గురి తప్పని గమ్యాలను గుర్తించుకుని
గతి తప్పని గమనాలను వెంటేసుకుని
ధర్మ నిరతిని గరిమ రీతిన పాటిస్తుంటే
సర్వ హితమై సన్నుతించి దరి చేరదా.... 

కపటమెరుగని శాంతి కపోతమై 
ఓటమి తటాకాలను దాటుకుని 
గెలుపు సూర్యుడవై పయనిస్తే 
చైతన్య క్రాంతమై వాకిట నిలవదా ... 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment