మసక బారుతున్న మనిషి
తేది: 04-06-2021
శీర్షిక: మృగ్యమౌతున్న మానవత్వం
కవిత సంఖ్య: 680
యుగధర్మమో కాల మహిమలో
కన్నుకుట్టి దృష్టి దోషాలే తగిలెనో
కడివెడు పాల లాంటి కలిసిన బతుకుల్లో
చిటికెడు ఉప్పు చిల్లి పగిలిన చందమాయె....
పల్లె తల్లి నీడన పరి పుష్టమైన
బంధాలు అనుబంధాలు
పట్నపు నాగరికత పడగ నీడల్లోన
పగుళ్లు వారి పలుచనాయే ....
స్వార్థాలు సవారి గుర్రాలై విహరిస్తూ
స్వైర విహారాలై సకిలిస్తుంటే
మానవీయతలు చిన్నబోయి నక్కి
మారు మూల దాక్కుంటున్నయి...
కలుషిత విషాహారాలో
కల్తీల మాయలో... కన్ను గప్పి
మనసును మాయలో ముంచి
మనిషిని మసక బార దీస్తున్నవి...
అనగనగా.... కథల్లో లాగ
ఆరాలు తీయాలేమో ఆత్మీయత
అనుబంధాల ఊసులు పోగేసుకుని
ముందు తరం మనుషులతో ముచ్చటించ....
పూనుకోవాల్సిందే మనమంతా
మాయా పురిటిలో సంధి కొట్టాల్సిందే
మందులాంటి మర్మమెరిగి వాత పెట్టాల్సిందే
మృగ్యమౌతున్న మానవత్వాన్ని తిరిగి
పట్టు కోవాల్సిందే...... మేలు కోల్పాల్సిందే ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment