Saturday, August 14, 2021

మట్టి నా శ్వాస తేది : 09-06-2021

 మట్టి నా శ్వాస

తేది : 09-06-2021
శీర్షిక : అవును మట్టే నా శ్వాస
కవిత సంఖ్య : 683

అండ దశనుండే అంటిపెట్టునకుని
పిండ దశలో గండాలన్నీ దాటించేసి
ముద్దుల నా రూపానికి మూలమయి
ప్రాణానికి శ్వాస పరిమళాలద్దింది మట్టి ...

అడుగడుగున పోషణలిస్తూ పాలించి
అడగక ముందే అమ్మలా నిలిచి 
అన్ని మజిలీలను కనిపెడుతూ
సర్వం సమకూరుస్తున్న మాతృమూర్తి ….

మట్టిరంగులో నలుపు నిలుపుకున్నా
సప్త వర్ణాల ఫల పుష్పాలను సమకూర్చుతూ
రమ్యమైన జీవిత ఆనందాలు పంచుతూ
అవసరాన క్షుద్భాదలు తీర్చే పితృ సమానురాలు…. 

తీపి చేదు వగరు పులుపు ఉప్పు
కారాల  షడ్రుచులను కూడా పంచుతూ…
కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలైన 
అరిషడ్వార్గాల విరించి ఆటలకు ఊతమై నిలుచు…. 

మొత్తంగా ఏకత్వంలో భిన్నత్వంగా
గోచరించినా... భిన్నత్వం ఇముడ్చుకున్న
ఏకత్వమే సుమా....చివరి మజిలీలో కూడ
ఏకాకినైనా చోటిచ్చి చేరదీస్తుంది అపర మాతృమూర్తిగా.....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment