Saturday, August 14, 2021

పరామర్శ తేది 25-05-2021

 పరామర్శ

తేది 25-05-2021
శీర్షిక: తొలకరి చినుకులా.... 
కవిత సంఖ్య: 671 

పరుల కష్టాలను పంచుకుని 
నష్టాలను పరికించి మనసుపెట్టి 
స్పందించి అందించే చేదోడు వాదోడే 
అభయహస్తమగు సంపూర్ణత్వంతో .... 

మరిచిపోయిన మనిషి 
మకిలి చేష్టలకు ప్రతిగా 
అంటుపురుగు ఆవిర్భవించె
ఆకతాయిగ కకావికలమై కవ్విస్తూ
ఆఘమేఘాల పరుగులెత్తిస్తుండే ...నేడు

అగులు బుగులుగ అందరం 
ఆరడుగులు కాదుకదా....బతుకు 
ఆశలు జీవితాన వదులుకోలేక 
అల్లంత దూరాన్నే ఆగిపోతున్నాం... 

కష్టాల బాధల బరువులు... కొసిరి 
మోయకపోయినా...నా అనుకున్న 
వాళ్ళ ఊరడింపుల ధైర్యపు ముచ్చట్లే
కొండంత శక్తినిచ్చి కొత్త ఆశలను 
చిగురింప చేయు కదా ...... 

ఓ తొలకరి చినుకులా కురిసి...
పచ్చల పందిరిని విచ్చుకునేలా చేసే..
వసంతంలో  కూసిన కల కూజితంలా..
శశి కురిపించిన వెన్నలలా... ఓ చిన్నని
పలకరింపే పరామర్శయి ప్రాణం నిలపదా.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment