ఆకాశం
తేది: 10-05-2021
శీర్షిక : పంచభూతముల ప్రమదం
కవిత సంఖ్య : 23
ఆకారమే లేకున్న అంబరమై
రంగు లేకున్నా రస రమ్య నీలమై
పంచభూతములలో పదిలమైన
పవిత్ర రేణువుల సమ్మిళితం ....
పాలపుంతలనెన్నింటినో
పదిలపర్చుకుని పగలంతా
ప్రభాకరునితో ప్రత్యక్షమై
పత్రహరితములొసగి ప్రాణులకెల్ల
ఆధారమై పావన విశ్వ జీవ కారుణ్యానికి
ఉనికి లేర్పరిచే జీవనది .....
రాత్రులందు తేటతెల్లమై
నిశిరాజు జాడలు చూపుతూ
అల్లంత దూరాన అలరారు
నక్షత్ర కాంతులను నజరానాగా
అందించి కాలగమనాల గణనలకు
నాందీ పలికిన నాడీ కేంద్రము ....
సాగరపు నీరు సంగ్రహించినను
మేఘమై గర్జించి మేలుగా వర్షించి
మేను పులకరింప జేయు కద
అంకురములకు చేయూత జాడలై చేర్చి
అచ్చంగా పచ్చల హారాలను
అలంకరింపజేయు అవనిమాతకు .....
ఆధ్యాత్మికాన... ఆకాశమన్న
ఏడేడు లోకాలటంచు ఎరుకపరిచె
భాగవతమున వ్యాసభగవానుడు
మన హైందవాన మహిమాన్యమై ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment