Saturday, August 14, 2021

ప్రశాంతత తేది : 13-06-2021

 ప్రశాంతత

తేది : 13-06-2021
శీర్షిక : యంత్రపు బతుకులు 
కవిత సంఖ్య: 135

పల్లె చెట్ల నీడన పదిలమైన
పవిత్ర ప్రశాంతత నాటి రోజుల్లో
పట్టణీకరణలతో  నడకలు నేర్చి
పారిశ్రామీకీకరణతో పరుగులే పెట్టె .....

అవిభాజ్య హిందూ కుటుంబాలను
అంటిపెట్టుకున్న ప్రశాంతతలు
స్వార్థాల సంచులు తగిలించుకున్న
పాశ్చాత్య జాడల్లో పగుళ్లు చూపింది....

ముల్లె దాహాలను అత్యవసరాలకే వాడి
మనుగడల జీవితాల మల్లె పొదల్లో
మమతల పందిరి జాడల నీడల్లో
మానవత్వపు తీగలు అల్లుకుని
మసులుకున్నన్ని రోజులు ధోకా రాలేదు......

ప్రగతి ప్రగతి... అంటూ మనిషి
పగలబడి పరుగులు పెడుతూ
పగలు రేయిల తేడాలు మరిచి
పట్టుమని తినే పిడికెడు మెతుకులకు  సైతం
పరేషానే  అవుతున్నాడు ......

బంధాలన్నీ ఆర్థిక సంబంధాలై
సాటి మనిషిని పట్టించుకోని
మర యంత్రపు బతుకులై పోయి
మరుగున పడిపోతున్నది ప్రశాంతత....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment