నియతి లేని స్వేచ్ఛ
తేది 12-05-2021
శీర్షిక: అహం
కవిత సంఖ్య : 662
ప్రకృతిలో పుట్టి పెరిగినా
పశు పక్ష్యాదులను చూసినా
మంచిని వంచుకోలేక పోతున్నాం
నలుగురి క్షేమంకై నడచుకోలేక పోతున్నాం
బాధ్యతలను గుర్తించలేక పోతున్నాం...
గతేడాది గడసరి కరోనా
తుఫానులా విస్తరించి
సునామీలు సృష్టించి
లక్షల ప్రాణాలు హరించినా .... మళ్ళీ
నీరుగార్చిన నియమాలేనాయే ...
అనుభవాల చిరునామాల
పేజీలు తిప్పుకుని ....
కరచాలనాల తిప్పలు తెలుసుకుని
నమస్కారముల గొప్ప లు గుర్తించి
మాస్కులే మనకు రక్షణ కవచమని
దూరాలే భారాలు తగ్గించునని
లాక్ డౌన్ విధించి లగాయించి చెప్పినా ...
చిలుకపలుకులన్నీ చిలక్కొయ్యకు తగిలించి
నియతి తప్పి స్వేచ్ఛల ఉచ్చులో
విహరించగానే .... రెండవ అలగా
అంతకు నాలిగింతల వేగంగా
పల్లె తల్లిని కూడా చుట్ట బెడుతుంది ...
అహాన్ని జయించలేము కానీ
ఆకాశపు అంచులు చేరాలంటాము
చూసి నేర్వము చెబితే వినము
అంతా నేనెనన్న గొప్పలకుప్ప ...
అన్నీ తెలుసుననే గుడ్డి నమ్మకం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment