Tuesday, August 3, 2021

మాతృమూర్తి తేది : 09-05-2021

 మాతృమూర్తి

తేది : 09-05-2021 
శీర్షిక : అమ్మా నీకు వందనం. 
కవిత సంఖ్య: 120 

వాంతులతో వర్ధిల్లగానే 
ఉనికి లేని ఉసురు ఉదరము 
నందు ముసురుకున్నదని 
తన్మయత్వపు జోల .... 

అందుకోబోతున్న ఉన్నతికి 
ఆగలేక సంతోషాన అందరి 
నోళ్లు తీపిన పడుతాయి 
ఓటింగులేని ఏకగ్రీవంలా .... 

రెక్కాడితే కాని డొక్కాడని 
బడుగులకు రోజువారీ చాకిరీలు 
కార్యాలయ తప్పని నిత్య కర్మలు 
మాసమెత్తు పని తగ్గకపోగా .... 

అనుభవమున్న అమ్మలక్కల 
మాటలు... ఈటలవుతున్న వేళ
గుండెలు చిక్కపట్టుకుని మొండిగ
కదిలి మెదిలి పోరాడుడే .... 

వంట పనికి ఇంటి పనికి 
వంత గూడ పాడుతూనే 
తాను తిన్నా తినకపోయినా 
ఇంటిల్లిపాదికి తినిపించి  
అందర్నీ నందనంగా చూసుకునుడే .... 

నెల నెలా గడిచిన కొలదీ 
నేల మీద అడుగులు బరువై 
తోడు బరువును మోస్తూ 
తొమ్మిది నెలలు ఎదురు సూసుడే... 

ఉహల్లో రెక్కలు తొడుక్కొని 
ఊసుల్లో రూపు దిద్దుకుని
మనసు  పొరల్లో మాట్లాడుకుని  
సాధారణమో ... సంక్లిష్టమో ... 
పూవులా పృత్విపై  దించేయడమంటే 
ఉదయమెప్పుడూ అరుణవర్ణమే ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment