Saturday, August 14, 2021

నాన్నకు ప్రేమతో తేది : 20-06-2021

 నాన్నకు  ప్రేమతో

తేది : 20-06-2021
శీర్షిక : హృదయ నివాళి
కవిత సంఖ్య :137

ప్రియమైన మా నాన్న
కీ శే నగునూరి దశరథం గారికి
హృదయ నివాళి .....

బహు తెల్లటి ఎరుపు రూపం
ప్రకాశవంతమైన దేహ తేజం 
ప్రజ్వలించు భక్తి పరిమళం
ఇచ్చగించి ముచ్చటించు ప్రజారంజకం ......

గురూపదేశం పొందిన మానసం
దివ్యమైన వైష్ణవ నామాలంకారం
నిత్య భగవద్గీతా పారాయణం
కళ్ళల్లో కదిలే  కాంతిపుంజం .....

ప్రశాంతమైన సుందర వదనం
పల్లెత్తు మాట వదలని వైనం
తన నడకలతోనే మాకు నడత
నేర్పిన సున్నితమైన విధానం ....

అత్యంత అలసటలో సైతం
ఆవగింజంత కోపమెరుగని గుణం
నవ్వులతోనే పువ్వులు పూయించి
క్రమశిక్షణల కట్టుబాట్లు దిద్దిన తేజం. 
కంటి చూపుతో కట్టుదిట్టం చేసిన అనుభవం  ......

ఉరుకులు పరుగులు అసలే వద్దని
ఉన్నతమైన నిర్మలత్వమే 
నిజమైన ఆయుధమని
మనసా వాచా నమ్మిన ధీశాలి..... 

గంభీరత్వం... అనురాగం ...
అజమాయిషీ....ఆప్యాయత..
గుంభనం .... చతురత ....
అన్నీ కలగలిపిన మూర్తిమత్వం .....

అమ్మంటే అల్లుకున్న అనురాగం
పిల్లలంటే వల్లమాలిన ప్రేమానుబంధం 
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లన్న ఆత్మీయతలు 
బంధు మిత్రులంటే  ప్రాణాలిచ్చే తత్వం....  

మాకే కాదు మా పిల్లలకు మార్గదర్శకం 
మాకీ జ్ఞాపకాలెంతో మనోరంజకం  
ఎంత చెప్పినా తీరని కావ్యం ....
మా నాన్నకు ప్రేమతో .....

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment