అచ్చు కాయిదం
తేది: 05-05-2021
శీర్షిక : అర్ధ నారీశ్వర అవతారం.
కవిత సంఖ్య: 656
అర్ధ నారీశ్వరుని అవతారం
ఆడ మగ పోలికల జననం
అసలుకు నకలుగా అక్షరాలను
చిత్రించి ప్రతిబింబించే మంత్రం ....
రాత రాసింది రాసినట్లుగా
బొమ్మ గీసింది గీసినట్లుగా
ప్రయత్నించి ప్రతిబింబించే
దాపరికం దగాలు తెలువని
దండి మర్యాదల రామన్న....
వరి కళ్లములో పంజ కొడితే
వడ్లు జలజల రాలినట్టుగా
అక్షరాలు పైన పరుగెత్తితే
ఆకారాలు కింద దిద్దుకుంటయి...
సాంకేతికతల సౌలభ్యాల
సామ్రాజ్యాలకన్నా ముందు
సాధు సంతతిల సౌమ్య గుణశీలి
నలుపులు నిండిన నిర్మల హృది ....
పనికొచ్చినంతసేపే..పాపం
ఒక్కసారి అసరు ఒడిషిందో
ఆటు మూటుగా పిసికి
ఆవలకి విసిరి గిరాటేసుడే ....
ఇప్పుడంటే ఇంకా మనం
చెప్పుకుంటున్నాం నయం... కానీ
ముందు తరం చరిత్రలలో
దాని జాడలు వెదకాల్సిందే సుమా ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment