Saturday, August 14, 2021

తీరని ఋణం తేదీ : 18-06-2021

 తీరని ఋణం

తేదీ : 18-06-2021
శీర్షిక :  అమ్మ సేవలు
కవిత సంఖ్య :  689

సర్వ సుఖాలను త్యాగం చేసుకుని
వేవిళ్లతో తాను వేగలేకపోయినా
నలుసైనప్పటి నుండే కంటికి రెప్పలా
కండరాల పొత్తిళ్ళలో కమ్మని పానుపేసి ....

మన కఠినమైన కదలికలన్నీ
కరుణించి మోదముతో  స్వీకరించి
కడుపారా ఆహారమీయడమే కాక
విసర్జించిన మలినాలతో సహా
దినం దినం ... నవమాసాలు మోసి....

కళ్ళల్లో వత్తులేసుకుని కనిపెట్టుకుని
కాలు చేయి కందకుండా భువిపై మోపు
రుధిరం క్షీరం చేసి ప్రతిదినము పెంచు
పడి లేచి... పద డుగులు వేసేవరకు
వెన్నంటి నిలిచే పేగు బంధం అమ్మది....

మనకు చిన్న దెబ్బ తగిలినా
తాను తల్లడిల్లి కంటనీరు కార్చు...
నలత చేసి అనారోగ్య మొస్తే
తాను కలత చెంది కకావికలమౌ .....

చదువులకో ... ఉద్యోగ బాధ్యతలకో...
కొంతలో కొంత దూరమైనా
కడుపు తీపి కాదనుకో లేక
బాగోగుల కబుర్లన్నీ చెప్పి
బాగు కోరుకుంటుంది ప్రతి క్షణం ....

అయ్య  చేతిలోనో ... ఆమె చేతిలోనో
పెట్టాక కానీ కొంతలో కొంత సేద తీరదు
మన జిందగీ అంతా  ఊడిగం చేసినా
జీవితాంతం తీరని అమ్మ సేవలు .....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment