కల్మషం
తేది: 19-05-2021
కవిత సంఖ్య: 25
శీర్షిక: కపటత్వం
కాకర వేపల కలబోతలా
పుట్టుకతోనో పెరిగే పరిసరాల
ప్రభావముతోనో ... మాటల్లో
చేతల్లో గారడీల కలి మాయలను
మర్మంగా దాచుకుని మలిన
కల్మషాలను విరజిమ్మే విషయం ....
ఎవరు మాత్రం పసిగట్టగలరు
అనురాగం కురిపించే తీయటి
తేనెలూరే పలుకుల దాపున
కుత్తుకలు కోసే కత్తులు దాగుంటాయని...
అమృతాలు వర్షించే
ఆ కనుదోయిల్ల అవతల
కఠిన పాషాణపు బాణాలు
పొంచి ఉన్న విషయం ....
మల్లె తీగల బంధంలా
పరిమళాలు వెదజల్లుతూ
వెన్నుతట్టే కర కములములే
కర్రు కాల్చి వాత పెట్టే రకమని ...
అప్పుడప్పుడు తగిలితేనే కదా
ఇల్లయినా కార్యాలయమయినా
దేశమైనా ఇరుగు పొరుగుల
మనసు మర్మం తెలిసేది ....
కల్మషాల విధానాలను ఏరుకున్నాక
అప్రమత్తతే రక్షణ కవచంగా చేసుకుని
అనవరతం ఆనందాలను పొందడమే...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment