కవన రవళి
చిత్ర కవిత (ముగ్గేస్తున్న మహిళ ... గంగిరెద్దు చెరుకుగడలు ...
గాలిపటాలు .... )
పచ్చలు పొదిగిన పల్లె తల్లి
ఒడిలో ఇనుమడించే పండగ శోభలు ....
చుక్కలు దిగివచ్చి చక్కగా
అమిరేనా ఇంద్రధనస్సులాంటి
రంగవల్లిలో .....
తెల్లవారక ముందుగానే
కళ్ళాపి చల్లి కాంతలంతా
రంగు రంగుల ముగ్గులతో
రమణీయత కుమ్మరించు ....
వింత వింత ఆకారాలతో
వినీలాకాశంలో విహరిస్తున్న
సప్తవర్ణ సుశిక్షుతులైన
బాలల ఆనందాల గాలిపటాలు ...
ఎరుపురంగు వస్త్రముతో
మెరుపులీనే బసవన్న
తురుపుముక్క తీరులా
చెఱుకుగడల చెంత నిలిచె ....
చేలంతా పంటలతో
చేవకలిగిన రైతన్న
సిరులొలికించే ధాన్యాలతో
సంతసించు హాలికుడు ....
నలుగుపిండి తలంట్లు
ఉదయాత్పూర్వపు తల స్నానాలతో
నూతన వస్త్ర ధారణలతో,
దైవ దర్శనములతో,
మాతృ మూర్తుల ఆశీస్సులు ....
పట్టు పరికిణీలతో ఉట్టిపడే
చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు
పల్లె పడుచుల కూని రాగాలు
సంధ్య వేళలో గోధూళి తరంగాలు...
No comments:
Post a Comment