Saturday, February 10, 2024

మనసు ముంగిట తేది : 06-01-2023 శీర్షిక: వలస పక్షులు ...

 మనసు ముంగిట 

తేది : 06-01-2023
శీర్షిక: వలస పక్షులు ... 
కవిత సంఖ్య : సహస్రాధికం    

మహా సంద్రంలోని  మత్స్యాల్లా ... 
వినీలాకాశంలోని  విహంగాల్లా ... 
కొన్నిసార్లు వరుస క్రమంలో ... 
మరికొన్ని సార్లు కలగాబులఁగంలా.... 

మనసు తరువు మీద వాలుతూనే  
ఉంటాయి.. వద్దాన్నా...వలపోతలతో... 
శక్యమైనవి కొన్ని వ్యూహాల అమలుకు 
ఊతమౌతున్నాయి ...ఇంకొన్నిఊసుపోకల 
ఊదరగొట్టి ఉలిపికట్టెలైపోతున్నాయి   .... 
చింతనల మడతలలో చిరాయువులై జ్ఞాపకాల 
పందిరిలో మెరుపులై మిగిలిపోతున్నాయి....  

పారిశ్రామికతల పరుగు పందెములో...  
సాంకేతికతల సంధికాలములో ....  
స్వంతానికి కూడా సమయంలేక... 
సాధనలేని సౌశీల్యతలై సద్దు మనిగి 
పోతున్నాయి ...అప్పుడప్పుడు కొన్ని .... 

వచ్చి వాలుతూనే ఉన్నాయి ....మళ్ళీ 
వలస పక్షుల్లా పయనమౌతూనే ఉన్నాయి ... 
లేదంటే వచ్చి వాలిపోయి  గువ్వల్లా...
ఒదిగిపోయి గూడు కట్టుకుంటే...
చోటు సమస్యేమో  .... 

సెలయేటిలోని కొత్తనీటి ఊటలా 
నిరంతరం పయనమవుతూనే ఉండాలి  .... 
కాదంటే...పాతవి పదిలమై పాతుకు పోతుంటే ... 
కొత్తవాటికి చోటు ఎక్కడుంటుంది....? 
ఊహల ఊసులు ఆలోచన తరంగాలు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment