నీ కోసం
తేది : 20-01-2023
శీర్షిక : పరితపనలు ...
కవిత సంఖ్య: సహస్రాధికం
ఏ క్షణాన నిను దర్శించానో
ఎదలో నిలిచిన చిత్రానివై
పదే పదే మదిలో తలుచుకునే
నా పాటకు పదనిసల పల్లవివైనావు ....
సొంతమని సాంత్వన పొందాక
జీవిత పయనంలో ...మననమే
ప్రతి క్షణం ... ప్రతి పనిలో ....
ఇంటయినా ... కార్యాలయమైనా ....
అప్పుడప్పుడు బాధ్యతలతో
సతమతమైనా ... మరుక్షణమే
మనోఫలకంపై ముద్రించుకున్న
మంద్రహాసం మదిలో సడి చేసేది .....
చిన్న చిన్న ఇబ్బందులలో
చిందులాడే సమయాన ... నీ
ఇందువదనమే సుందరమై
గందరగోళాలను దూరం చేసేది ....
ముప్పిరిగొన్న తిప్పల తోటలో
అలసటలతో అల్లాడుతుంటే ...
జ్ఞాపకాల పరిమళాలు అల్లుకుని
ప్రాణవాయువులై పలకరించేవి ....
మనసు దోచిన మాయలో ...
తొలి చూపుల చిత్రమో ...
నీ కోసం తలచిన జ్ఞాపకాల
పుటలన్నీ కుసుమ రాగరంజితమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment