దారి తప్పుతున్న గురుతులు
తేది : 05-01-2023
శీర్షిక: బీటలు వారుతున్న కోట గోడలు ...
కవిత సంఖ్య : సహస్రాధికం
మల్లెలు మందారాలు మరువ ధవనాలు
బంతులు చామంతులు కనకాంబరాలు
సప్తవర్ణాలయినా లుప్తమెరుగని మా లకాధారం
మరుగునుండే శ్వేతవర్ణపు తోరం అంతస్సూత్రమై ...
విశ్వం కన్ను తెరవకముందే వింతగా
విశిష్టతలు పొదువుకున్న ఘన సంస్కృతి ....
గీత బోధనల అమృత సారం
నేటికి విశ్వజనీనత ఆమోద పాత్రం....
హిమనగపు సానువుల సొగసు పరిమళం
అనన్యమైన సాంప్రదాయాల సచ్చరితలు
అనితరమైన వారసత్వ ఆచరణలు ....
అమోఘమై నిలిచె నేటికీ ఆమోదయోగ్యమై....
భిన్నత్వంలో ఏకత్వం ఇముడ్చుకుని
విభిన్న మతాలను అక్కున చేర్చుకుని
ఆశ్రయమిచ్చిన సమున్నత సంప్రదాయం
భువిలోనే భారతమ్మ నందనవనం....
ఆత్మీయతలకు ఆనవాళ్ళైన కుటుంబ బంధం ....
ఆప్యాయతలకు చిరునామాలైన సంఘం...
విశాల విశ్వంలో వెలుగొందిన చిరుదివ్వెలు ...
వింతగ దారి తప్పుతున్న గురుతులు ....
ఏ క్షణాన ఏ పాపపు కన్ను పడిందో గాని ....
కాట కలిసిపోతున్న కంచి కథలలా ....
ఒకటొకటిగా కదులుతున్న ఇటుకరాయిలా
బీటలు వారుతున్న కోటగోడల ఆనవాళ్ళు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment