Monday, February 12, 2024

ఒక్క మాట తేది:01-02-2023 శీర్షిక : ఒక్కటంటే ఒక్కటే మాట

 ఒక్క మాట 

తేది:01-02-2023
శీర్షిక : ఒక్కటంటే ఒక్కటే మాట 
కవిత సంఖ్య :  211

సనాతనమైనా ... సంప్రదాయమైనా ... 
సవినయముగా సన్నుతించె కదా ... 
నిజమెప్పటికైనా నిప్పుల వర్షమేనని .... 
స్వార్థాలను వదలమని సంకేతిస్తూ.... 

సంఘమైనా...దేశమైనా ..ప్రతినిధులంతా 
సగటు మనిషికన్నా సమున్నతమే కదా ... 
ఇంత  చిన్న లౌక్యాన్ని తర్కాన్ని  గాలికొదిలి 
కోటరీల కనుసన్నలలోనే  కిరీటాలు 
పెట్టుకున్నంత  మాత్రాన ...విలువలేల ? 

కాలం కరుణించి కకావికలమైన 
దేశమాతను... వేలు ... లక్షల వీరులు 
తమ దేహాలను తృణప్రాయంగా సమర్పిస్తేనే 
ప్రజా స్వాతంత్య్రం ఫరిడవిల్లినది .....  

బంగారు బాల్యం గుర్తుకొస్తే విలువల వలువలు 
తొడుక్కున్నామన్న సంతృప్తి కలగాలి .... 
కానీ అదేమిటో ....భారతమ్మ బాల్యం నిండా  
ముచ్చటలన్నీ ముచ్చెమటలు పోయిస్తున్నయి ... 

భూస్థాపితమై పోతుందనుకున్న భూతకాల
విషయాలు ఒక్కొక్కటిగా భూతద్దాలలో 
చూస్తుంటే...స్తుతించిన నోటితోనే...రోతతో   
గతించిన ఆనవాళ్లతో  మతి చలిస్తున్నది .... 

ఇంత జరుగుతున్నా ...ఇంగితం మరిచిన 
వర్ధమాన నాయకగణం ... వర్తమానంలో 
మారతారనుకుంటే.... మన అమాయకతలతోనే మరో 
భవితల చరితకు శ్రీకారం చుడుతున్నారు .... 

ఇకనైనా ... ప్రజాతంత్రం... మేల్కొని 
ఎప్పటికప్పుడు పక్కాగా లెక్కలు సరిచేసే 
బొక్కలు పూడ్చడం నేర్చుకోవాలి .... 
తక్కెడ మొగ్గు చూపకుండా నిక్కచ్చిగా ... 

చేతులు కాలాక ... ఆకులు పట్టుకోకుండా.. 
సహాయ నిరాకరణలతో షెడ్యూళ్లను సర్దుతారో ... 
సత్యాగ్రహములు చేసి  సూత్రాలను నిగ్రహిస్తారో .... 
ఉద్యమాలతోనే  ఊదరగొడతారో ....

పాలక వర్గాల ఇనుప సంకెళ్ళ పట్టునుండి 
పవిత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి  
కావాల్సిన పాలనా మార్పులను కాముక చేసుకొని 
తీరవల్సిందిగా ఒక్కటంటే ఒక్కటే మాట .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment