ఇదేనా ఆధునికత
తేది : 11-01-2023
శీర్షిక : తలా ఓ చేయి ...
కవిత సంఖ్య : సహస్రాధికం
అంకురాన అమరాల్సిన
ఆధ్యాత్మికతలు అటకెక్కినాక
ఆకులకు చీడ తగిలిపోయి
పత్రహరితం పరారయ్యింది ....
బాల్యంలో బంతులై విరవాల్సిన
క్రమశిక్షణలు...స్వేచ్చా మాయలో
సేద దీరుతూ బరితెగించి
జబర్దస్తీగా బలాదూరవుతున్నది ....
మాతృమూర్తుల మందలింపులు
గురుతుల్యుల బోధనలు
కర్ణపుటములపైనుండే జారిపోతూ
కఠోర సత్యాలను ప్రదర్శిస్తున్నది.
వరసబెట్టి వాయిస్తున్న
దూరదర్శిని ... చరవాణి ...
సంఘ ప్రసార మాధ్యమాలు
చంకనెక్కి గారాలు పోతున్నాయి ...
కట్టూ బొట్టూ కలుషితమై
జుట్లు విరబోసుకుని పిశాచులై
వస్త్రధారణలు కొంత మేర
వంకర చూపులకు గురౌతున్నాయి ...
పాలకుల పట్టింపులేని తనం
అధికారుల అమ్యామ్యాల పర్వం ...
కట్టుబాట్లులేని స్వైరవిహారం ...
కలిసి తాండవ చేస్తూ వెక్కిరిస్తున్నాయి ...
సంస్కృతయినా ... సంప్రదాయమైనా
బతికి బట్ట కట్టాలంటే ...
తల్లిదండ్రలు ... గురువులు ...
పాలకులు ... అధికారులు ...
తలో చేయి వేయాల్సిందే ....
తరాలు వెలిగిపోవాలంటే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment