లలితగీతం.
తేది : 31-12-2022
శీర్షిక : మాధవా ….
కవితసంఖ్య: సహస్రాధికం.
మాధవా మధుసూదనా
మా మొర వినరావా //2//
దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా
అష్టమీ విశిష్టమైన అవతారం ఎత్తావు….
అష్ట మహిషులకు ఇష్టమైన ప్రభువుగా
అష్టమీ తిథిరోజున ఇష్టమే జన్మదినం...
మాధవా మధుసూదనా
మా మొర వినరావా
చెరసాలన జన్మించి మర్మాలను బోధించి
యమునాతటి దాటినీవు గోకులము చేరినావు ....
సుందరమగు నందవ్రజం ఆనంద నిలయంగ
యశోదమ్మ కోరికను విడమరిచి తీర్చినావు ...
మాధవా మధుసూదనా
మా మొర వినరావా
వెన్నలన్నీ తస్కరించి జున్నుపాలు జుర్రుకుని
చిలిపి చిలిపి చేష్టలతో చిత్రంగా ఆడినావు ....
మాయలెన్నో చేసినా మనసులన్నీ దోచినా
గోపికల మమకారం గోకులమే నీ పరివారం...
మాధవా మధుసూదనా
మా మొర వినరావా
కాళీయుని మర్ధించి కలుషితాలు బాపినావు
అసురులను సంహరించి లీలలెన్నో చూపావు...
అపాయాలనెప్పుడూ ఉపాయంగా ఎదిరించి
ఆపదలను నివారించి కాచుకుని నిలిచావు ...
మాధవా మధుసూదనా
మా మొర వినరావా
పాండవుల పక్షమున దండిగా పోరాడి
ధర్మమును వెన్నంటి దాపుగా నిలిచావు ...
గీతను బోధించి గాండీవిని మేల్కొలిపి
విశ్వానికి కానుకగా విశిష్టమై అందించావు ....
మాధవా మధుసూదనా
మా మొర వినరావా
యుగములెన్ని మారినా సుగమములే నీ రాక
జీవహింస పెరిగిపోయి పాపముల హద్దుమీరే
మానవాతీతముల దానవం రాజసమాయే
దుష్టులను దునుమాడి శిష్టులను రక్షించుము ....
మాధవా మధుసూదనా
మా మొర వినరావా //2//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment