ప్రేమ ఎంత మధురం
తేది : 14-02-2023
శీర్షిక : జ్ఞాపకాల దొంతర
కవిత సంఖ్య : సహస్రాధికం
మననమే మహోన్నతమైన పులకరింపు
ప్రాణమివ్వాలన్నంత పరితపనలతో
పలకరిస్తుంది ....కనపడకపోయినా
కమ్మని మధురిమల ఆస్వాదనలను
అందిస్తుంది ...వినపడకపోయినా
వింతగా ప్రాణాలను రక్షిస్తుంది ...
ప్రేమ ఎప్పుడూ మధురమే
సర్వకాల సర్వావస్థలలో
సప్తవర్ణాలు పొదువుకున్న
ఇంద్రధనుస్సులా .....
అవనిమాత కాలుష్యాల కాటుకు
బలి కాకముందున్న సెలయేటి
చెలిమెల నీరంత స్వచ్ఛమైనది
హిమాలయాల్లో పుట్టిన నదులంత
పవిత్రమైనది ....
పరిసరాలను మైమరిపించి
పరస్పర హృదయాలను మీటి
రాగాలు పలికించి జతులకు గతులను
తాళాలను జత చేసేది ....
ధనిక పేదల బేధాలు మరిచి
ధునిలా ప్రజ్వలించేది ....
స్వార్థాలను సాంతం వదులుకుని
త్యాగాలను నిత్యం అనుసరించేది ....
ప్రేమను ఎంత వర్ణించినా ...
ఎన్ని రకాల తెలియజేసినా ....
అసలు సిసలైన ఆ మధురం
అనుభవిస్తేనే ... అవపోశన
పడితేనే తెలుస్తుంది ....
ఓడినా ... గెలిచినా....మధురిమలనే
జ్ఞాపకాల దొంతరలుగా మనసు
గదిలో బందీ అవుతుంది ....
కావ్యంలా మనసు అరలలో
నిక్షిప్తం అవుతుంది ....
No comments:
Post a Comment