Saturday, February 10, 2024

కథ : ఇచ్చిన అంశానికి. తేది 08-01-2023 అంశం : అమెరికాలో ఉన్న మనమరాలు వీడియో కాల్ కోసం రాత్రివేళ మహేష్ దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు .

 కథ : ఇచ్చిన అంశానికి. 

తేది 08-01-2023
అంశం : అమెరికాలో ఉన్న మనమరాలు వీడియో కాల్  కోసం రాత్రివేళ మహేష్ దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు . 

కథ : కనపడని వేదన ... 

పారిశ్రామిక ప్రగతి రథ చక్రాలపై పరుగులు పెడుతుంటే .... సాంకేతికత చంకలో దూరి గిలిగింతలు పెడుతుంటే ... మిగిలిందేమిటి ... భార్యకు భర్త ...భర్తకు భార్య... 
ఎక్కువకు ఎక్కువగా ఉస్సూరుమంటూ ఈ రోజుల్లో ఇంటికి ఇద్దరే అయిపోయారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడి ... పెళ్లిళ్లు చేసుకుని వేరే ఊర్లలోగాని .... వేరే దేశాలలో గాని స్థిరపడి పోతున్నారు. అందుకు మహేష్ కుటుంబం కూడా అతీతమేమి కాదు. 
                      ....... 
మేమిద్దరం మాకిద్దరంటూ  అందమైన నినాదాన్ని దేశం మీదకు వదిలి .... ఎనభైల్లో పాలకులు దేశ జనాభా పెరుగుదలకు నివారణగా సూచించారని మొన్న మొన్నటి వరకు గాఢంగా నమ్మిన మహేష్ దంపతులు కూడా  ప్రభుత్వ ఉద్యోగంలో  ఉన్నప్పుడు ఈ నినాదానికి  గొప్పగా ఆకట్టుకుని, ఇద్దరు పిల్లల తదుపరి ఆపరేషన్ చేయించుకుని...ఇప్పుడేమో  ప్రభుత్వాన్ని పనిగట్టుకుని తిట్టుకుంటున్నారు. పాలకుల కపట పన్నాగంలో పాచికలమై పోయామని బాధపడుతున్నారు.  
                      .......  
మహేష్ చిన్నపాటి  ప్రభుత్వ ఉద్యోగి. భార్య  కామేశ్వరి భర్తకు తగిన భార్య, చక్కని గుణవతి.  మహేష్ కామేశ్వరి  అన్యోన్య దంపతులు. ఒక బాబు బలేశ్వర్  మరియు ఒక పాప శివకామసుందరి  ... ఇద్దరు పిల్లలు, ఇద్దరికీ రెండు సంవత్సరాలు తేడా . పదవ తరగతి వరకు చదువు కళ్ళెదురుగా అందుబాటులో ఉన్నది.  ఇద్దరు కూడా  చాలా చక్కగా పోటా పోటీగా  చదువుకుంటున్నారు. బాబు గమ్మత్తుగా ఇంతవరకు సరి అంకె తరగతి (2,4,6,8 లలో ) తరగతిలోనే ప్రథముడిగా దాదాపు 
92 నుండి 95 % మధ్య స్కోర్ చేస్తూ వస్తున్నాడు . వాడి స్నేహితుడు రంజిత్ బెంగాలీ అబ్బాయి మాత్రం  బేషి అంకె తరగతుల్లో(1,3,5,7,9 లలో ) టాపర్ గ  వస్తున్నాడు.  ఇదంతా గమనిస్తున్న మహేష్ కు వాళ్ళబ్బాయి మీద నమ్మకమేర్పడి .... తప్పకుండ పదవ తరగతిలో మంచి మార్కులతో పాసవుతాడని మరియు తరగతిలో కూడా మొదటి రాంకు తప్పక వస్తుందని ధీమాగా ఉన్నాడు ... అనుకున్నట్టుగానే తరగతిలో మొదటి స్థానమే కాకుడాఫ్ 96% పాసయ్యాడు.  
 
మెడికల్ వైపు ఆలోచించడానికి కూడా జంకి ఇంజనీరింగుకు ఉపయోగపడే విధంగా ఎం పి సి వైపు అడుగులేయించాడు . అనుకోకుండా ఆ సంవత్సరమే బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జరిగిన అవకతవకల్లో ఒక్క గౌతమ్ కాలేజీ తప్ప ...నిజమో అబద్దమో గాని ... ప్రత్యక్షంగానో ... పరోక్షంగానో మిగతా అన్ని కాలేజీల హస్తమున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి... 

ఇంకేముంది ఆ కాలేజీకి పోటీ పెరిగిపోయి ఎలాంటి స్కీములు వర్తించక ఫీజు మొత్తం కట్టవల్సి వచ్చింది ... అవుతే అయ్యింది గాని  97% మార్కులతో ఎంసెట్ ర్యాంకు 501 వచ్చింది. ఇంకేముంది.  ఎన్  ఐ  టి  కురుక్షేత్రలో అనుకున్న బ్రాంచి సీటు దొరికింది ...  

తదుపరి  అమ్మాయి శివకామ సుందరి  కూడా  97.2% తో  మంచి మార్కులతో  పదవ తరగతి పాసై అన్నయ్య బాటే ....విజయవాడ వైపు నడిచి మరో మంచి కాలేజీ నలందలో జాయిన్ అయ్యింది. అబ్బాయి ఇంజినీరింగ్  రెండవ సంవత్సరం అయిపోయేసరికి అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ 97% మార్కులతో  ఎంసెట్ 800 ర్యాంకుతో  పాసైపోయి జె ఎన్ టి యు  అనంతపూర్ లో అనుకున్న సీటులో  జాయిన్ అయ్యింది . 

చూస్తుండగానే బలేశ్వర్ నాల్గవ సంవత్సరం పూర్తిచేసి ఎం ఎస్ కని  అమెరికా బాట పట్టినాడు. అక్కడే చదువు అయిపోయి మంచి ఉద్యోగంలో స్థిరపడినాడు. మరో రెండు సంవత్సరాలు గడిచి పోయాయి. అనుకున్నట్టుగానే సరి తూగి చదువుకున్న అమ్మాయి అర్చనతో పెళ్లి జరిగింది. అర్చన అక్కడికి వెళ్ళాక సరైన ఉద్యోగం వెదుక్కుని ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు.  

 ఇంతలో శివ కామ సుందరి చదువైపోగానే మంచి ప్యాకేజీ తో ఉద్యోగం వచ్చింది. అమ్మాయి పెళ్లి కూడా చంద్రతో జరిగిపోయింది. ఆ సమయంలో సాఫ్ట్ వేర్ లో వచ్చిన మందకొడి ఆధారంగా కూతురు అల్లుడు కూడా అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. 

కొడుకు కూతురు పిల్లలతో వేర్వేరు ఊళ్ళల్లో అమెరికా లోనే  సెటిల్ అవ్వడం వలన .... మహేష్  రిటైర్ అయి ఉన్నందున అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నారు.  ఈ  మధ్యన  కరోనా పుణ్యమాని ప్రయాణాలు తగ్గించుకుని ... వీడియో కాల్స్ ఎక్కువ సార్లు చేస్తూ భార్యాభర్తలు  ఆశాజీవులై బ్రతుకుతున్నారు.  అబ్బాయికి ఇద్దరు పిల్లలు అమ్మాయికి ఇద్దరు పిల్లలు. అందరి డెలివెరీలకు వెళ్లి రావడం మూలాన అటు కొడుకు పిల్లలతో ఇటు కూతురు పిల్లలతో చనువెక్కువే . 

ఎందుకో కానీ అనుకున్న సమయానికి మానవరాళ్లతో  ఫోనులో  పలకరించుకోలేకపోతే  మహేష్ కేమో కానీ ... కామేశ్వరికి మాత్రం కాలు చేయాడదు. ఎంతైనా తల్లి మనసు కదా ..అబ్బాయి వాళ్ళు రెండు రోజుల క్రితం మాట్లాడారు కానీ అమ్మాయి శివకామసుందరి వాళ్ళు మాట్లాడక వారం  రోజులైంది . 

సరిగ్గా గత 5 రోజులనుండి వారున్న ప్రాంతంలో చలి మంచు తీవ్రత అని వార్తలు వింటున్నారు . పిల్లలు మాట్లాడక వారం  రోజులైంది... ఎందుకో ఎలాగైనా పిల్లలతో మాట్లాడాలని అల్లుని వాళ్ళకు దగ్గరగా ఉండే వాళ్ళ   ఫ్రెండ్స్ కు ఫోన్  చేసి మంచి చెడు కన్నుక్కున్నారు .  బాగున్నారని అల్లుని మిత్రుడు గోపి వాళ్ళు కూడా చెప్పారు. అయినా నిమ్మళించని మనసు .... వీలైతే ఒకసారి అల్లుని వాళ్ళింటికి వెళ్లి.... పిల్లలతో  ఫోన్లో వీడియో కాల్   మాట్లాడించమని  బతిమాలుకున్నారు .  

అల్లుని మిత్రునికి చెప్పాం కాబట్టి ఎంత రాత్రయినా మంచిదేనని అమెరికాలో ఉన్నపెద్ద మనమరాలు వీడియో కాల్  కోసం రాత్రివేళ మహేష్ దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు .  దాదాపు వాళ్ళ మధ్యాహ్నం  అంటే మనకు రాత్రి పిల్లలతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత గాని ఇద్దరికీ మనశాంతి లభించలేదు. 

అమెరికా అంటే ఎంతోమందికి గొప్పైనా .... తల్లి దండ్రులకు మాత్రం కనపడని వేదన .. 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment