Saturday, February 10, 2024

కళాశ్రీ చిత్ర కవిత తేది: 20-01-2023 శీర్షిక : ఎవరివో ?

 కళాశ్రీ సాహితీ వేదిక ... 

చిత్ర కవిత
తేది: 20-01-2023
శీర్షిక :  ఎవరివో ? 
కవిత సంఖ్య : 207

కర్ణ కుండలముల కాంతులీనంగా  
నుదుట తీర్చిదిద్దిన సూర్యచంద్రుల 
సూదంటు రాయి చూపులతో నిలిచె 
కొప్పున పూలెట్టుకున్న కోణంగి .... 

చమికీల గాజులు సక్కంగా మెరువంగ 
కంఠమున హారములు కాంతులీనంగా 
జరి అంచు చీరలో జిగినీలు కురువంగా 
ధగ ధగల మెరుపులా దండి దరహాసం .... 

పసిమి వెన్నెలతో పైటను చెక్కి 
చురకత్తుల్లాంటి చూపులతో 
కొమ్మొక చేత కొడవలి మరోచేత 
అచ్చంగా నండూరి గారి వెంకివా ? ... 

చూడచక్కనైన కుందనాల బొమ్మ 
చూపరులను ఆకట్టుకోగలిగే 
అందమంతా  పొదువుకున్న
పదహారణాల తెలుగు పడుచు .. 

కనకాంబరాలు తురిమిన కాంతామణి 
తీరైన కను ముక్కు తీరుతో 
నిర్మలమైన చూపులతో నిలిచిన 
విశ్వనాథులవారి కిన్నెరసానియేమో ... !

ఎవరివో ... నీవెవరివో .... 
సెలవీయగా రాదా ... చెలీ .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment