Monday, February 12, 2024

ప్రేమ పెళ్లి తేది : 14-02-23 శీర్షిక : సంస్కరించుకోవడం ...

 ప్రేమ పెళ్లి 

తేది : 14-02-23
శీర్షిక : సంస్కరించుకోవడం ... 

పరిచయాల వర్ణమాలకు 
మమతల గంధపు మాటలద్ది  
ఆత్మీయత కుసుమాల వాక్యాల 
జోడింపుల మూటలు గట్టి పుటలన్నీ 
నింపడమే ...... 

నింపిన పుటలలోని ముగ్ధ భావాలకు 
రాగం ఒక్కటైతే ... అడుగులు కలిపి 
ఏడేసి ....ముడులు మూడైతే ....జీవన 
పయనమంతా వెలుగులు నింపడమే .... 
కలకాలం నీతోనేనని బాసలు చేస్తూ ...

ప్రేమించిన మనిషితో పెళ్లి 
జీవించిన కాదా అమరత్వం ... 
కలలను రంగరించి కాచి వడపోసుకుని 
కార్యరూపం దాల్చుకోవడమంటే .... 

అనుక్షణం మననం ... 
ఆరాటాల మధనం .... 
అడుగువేస్తే సాధనం .... 
ఆలోచనల పందిరి వేసి 
గమ్యపు చేరికకు గమనం సాగిస్తే .... 

కనిపెంచిన తల్లిదండ్రులను 
కనిపెట్టుకుంటూనే  .... 
కట్టుకోబోయే వారిని ఒప్పించి 
సమన్వయ పరచడం.... 

కట్టు బొట్టుల కమనీయం
కళాత్మకమైన శుభ సూచకం
కనుబొమల నడుమ కాంతివలయం
కనికట్టుగ  కట్టిపడేసే హైందవం...

వరుడు వధువులు విశిష్టములై నిలువ
సంస్కృతీ సంప్రదాయ సంపదల
సంస్కరింపబడటమే... ప్రధానమై
ఆయురారోగ్యముల భోగమే అవనిలో
మేలైన భాగ్యమై నిలిచె .....  

మూడు ముళ్ళే ముఖ్య భూమికలయి
సత్సంతాన వ్యవస్థార్థం సంక్షిప్తమయ్యే 
వేదోపనిషత్తుల విస్తృత మార్గదర్శకమైన
ముప్పదారు పెళ్ళిముచ్చట్ల ముద్దు తీర్చే వేదిక ....   

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment