74 వ గణతంత్రం
తేది : 26-01-2023
శీర్షిక : నా పాఠశాల
ఒకటా...రెండా....అంతకంతకు
ఇకమతుగా ఇన్నేళ్లు కళ్ళు గప్పిన
చరితంతా భళ్ళుమని బజారులో
పడిపోయే సరికి ....ఒళ్ళు హూనం
అయినట్టనిపించి భుజాలు
తడుముకుంటున్నది.....
కపట కల్మషమెరుగని భారతీయం
ఉసురు తీస్తున్న మాయరోగానికి
ఉడతాభక్తిగా వంద దేశాలకు
ఉచితంగా వాక్సిన్లను పంపి
ఉద్ధరించిన విషయం... ఇటు లోపల ...
అటు బయట ...ఆనందించినా....
ఉద్యమాల పురిటిగడ్డగా పేరొంది ...
నాటి నుండి నేటివరకు నలిగిపోయి ...
అంకురించిందన్న ఆనందం కంటే ...
సంక్రమించని విద్యావిధానంతో
ప్రాణవాయువులందక సతమతమైపోతూ
వెంటిలేటర్ పైన వెళ్లదీస్తున్నది బ్రతుకు ...
పల్లెల్లో బడి బంగళాలు శిథిలమై
జీర్ణావస్థలో కొట్టు మిట్టాడుతుంటే ...
అక్కరలేని మిరుమిట్లు గొలిపే కొత్త కొత్త
బంగళాలతో ... కొత్త కొత్త అంతర్నగర
యానములతో చిత్తవుతున్నది పట్నం
నుమాయిషు .....
ఎందుకో ... కలుపు మొక్కలతో ...
కంటకాలతో ... మొండి గోడలతో ...
నా పాఠశాల... మనసును కకావికలం
చేసింది ... ఈ నాటికి సరైన సౌకర్యాలు
లేక ... బాలికలకు బాధలను మిగుల్చుతూనే ...
ఏ విషపు కన్ను పడిందో ... నా పల్లె
ఇంకా పంతొమ్మిది వందల డెబ్భై
రొండు లాగానే పుణికి పుచ్చుకున్నది
ఏ మాత్రం మార్పు కానరాక ....
ఇరువది రెండున ... మా పూర్వ విద్యార్థుల
సమ్మేళనం మిగిల్చిన భావం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment