Monday, February 12, 2024

చిత్ర కవిత తేది : 11-02-2023 శీర్షిక : వ్యసనం ...

 చిత్ర కవిత 

తేది : 11-02-2023
శీర్షిక : వ్యసనం ... 

తనను తాను మరచినదా... ఏమి ?
తనువు పంచుకున్న చిన్నవాడిని 
సైతం.... కాదని తలమునకలయ్యింది 
తలా తోకా లేని ... కాని ... చరవాణిలో ... 

ముసి ముసి నవ్వుల మురిపములే 
ముక్కు మొహం తెలియని వారితో సంభాషణలు...  
ముంచుకొచ్చే ప్రమాదం పసికట్టక 
ముదితకు పిడికిట ఇమిడిన చరవాణితో .... 

సాంకేతికత పెరిగిందని సంబరపడాలో ... 
సందు దొరికితే అనకొండలా మారిపోయి 
మనిషిని సాంతం మింగేస్తుందని భయపడాలో ... 
మితమే మనిషికి హితమని బోధనలు .... 
అతి సర్వత్ర వర్జయేత్  అన్నారు...అయినా 
పెడచెవిన పెడుతున్న దాఖలాలు .... 

ఆలోచనా వివేచనల సంపదలతో 
జీవరాశిలో మిన్నంటూ మురిసిన 
మానవాళి... భస్మాసుర హస్తములా 
అదే ఆయుధమై ....అంతరిస్తుందేమో .... 

గురువనే భ్రమలతో గూగులమ్మతో 
గుసగుసలలో మునిగి తేలితే ....అంతా .   
నీవేనంటూ అన్నింటికీ నీవేనంటూ ... 
చరవాణిపై ప్రేమలు పెంచుకుంటే .... 
కొన్నాళ్ళకు ఆలోచించలేని పుచ్చుపడిన 
మెదళ్లను కొక్కేలకు తగిలించుకోవాలి .... 

అల్పమైన వాటికి దాస్యత్వమే... 
పదే పదే ధ్యానించడమే వ్యసనం ... 
వ్యసనాలకు బానిస కాకుండా....
వ్యసనం బారిన పడకుండా... ఎదగాలి ... 
 
పరికరాల తోడూ నీడలు లేకుండా 
పరిస్థితులను అవపోశన పట్టగలిగి 
విపత్తులను ముందే పసిగట్టే పశు 
పక్ష్యాదులలా మానవాళి  ఎదగాలి ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment