అంశం : అలిశెట్టి ప్రభాకర్
శీర్షిక : అక్షర దివిటీ ...
తేది 30-12-2022
నూటికో ... కోటికో... ఒక్కరు
నూతన ఒరవడులను సృష్టిస్తారు ...
మూస విధానాల ముసుగులను
తొలిగించి..పదండి ముందుకు పదండంటూ
తోసుకుంటూ ముందుకు దూసుకెల్తారు...
కనుపాపలనుండే కత్తులు దూసే
సునిశిత సూక్ష్మగ్రాహి స్ఫురద్రూపి…
రూపములను రాశి పొసే అపురూప
చిత్రకారుడు ఆ రవివర్మ వారసుడు…
సృజనాత్మకతకు సూత్రమైన ఆత్మగా
సుందరమైన చిత్రాల ఛాయాగ్రాహకుడు ...
మినీకవితల మిణుగురు పువ్వై
బడుగులకు దివిటీలు మోసి ...
బడా బాబుల గుండెల్లో సూటిగా
రక్త రేఖలను లిఖించాడు….
పిడికిలి బిగించి ఎదిగినా
పిసరంత సామజిక చైతన్యమైనా
సత్వరమని శ్వాసించాడు ...
పిట్ట కొంచం కూత ఘనంలా
అల్పాయుషువు అసువులు తీసినా
ఎర్రపావురాలను ఎగరేసి....
మంటల జండాలను భుజాన మోసి
చురకలతో వాతలు పెట్టి
చిచ్చర పిడుగై చీల్చి చెండాడినాడు...
సూక్ష్మంలో మోక్షంగా బోధనలై
ప్రతి కవితలోను ప్రత్యేకతలే....
చిన్న చిన్న పదాలతోనే
అనంతమైన భావప్రకంపనలతో
అల్లల్లాడించిన అప్రతిహత ఘనాపాఠీ ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment