Saturday, February 10, 2024

హాస్య గేయాలు తేది : 10-09-2022 శీర్షిక : టివి సీరియళ్లు

 హాస్య గేయాలు

తేది : 10-09-2022
శీర్షిక : టివి సీరియళ్లు 
కవిత సంఖ్య : 983

సీరియళ్లు నోయమ్మా 
సీరియళ్లుని .... 
ఘల్లు ఘల్లు మోతలతో
గజ్జెల రవము ... 

సీరియళ్లు నోయమ్మా 
సీరియళ్లుని ....

బుల్లి పెట్టె చుట్టివచ్చే  
బుడి బుడి సీరియళ్లుని 
వారానికి ఐదొద్దులు
వరసపెట్టి ఉసురు తీస్త 
 
వత్సరాల పొడుగూతా 
చిచ్చరపిడుగై వస్తాను
నవ్విస్తా ... ఏడిపిస్తా... 
నంగనాచి పాత్రలతో …

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... 

కొండంత రాగంతో 
కోడిపుంజు సంగీతం …
కూతపెట్టు టైటిల్ సాంగ్
మోతమోగు పక్కింట్లో ... 

ఎండనక వాననక 
నిండు పున్నమి వెన్నెల్లో 
రెండేసి ప్రకటనలతో 
వండేసి పెడుతుంటాను 

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... 

భాషనంత బలిచేసి
భావాలను చెప్పిస్త
మాండలికం జొప్పించి
మధురాన్ని చెడగొడత… 

వినోదాల పేరుతో 
వింతగా ప్రవర్తిస్తా
సెన్సారు లేదుగాని
సెంటిమెంట్లు పెట్టేస్తా…

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... 

అత్తలకు పెత్తనం  
అట్లకాడ వేడిచేస్తా 
కోడళ్లతో కొట్లాటలు 
కొత్త కొత్తగ నేర్పిస్తా ... 

ఇద్దరేసి భార్యలతో 
ఇల్లు పీకి పందిరేస్త 
ఆడపడుచు ఆరళ్ళు 
అదిరేటి బెదిరింపులు....  

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... 

ఆడోళ్లకు ఆడోళ్లనే 
ప్రతినాయక పాత్రలు 
అరవ కష్టాలన్నీ
కుప్పపోసి చూపిస్తా ... 

తర్కమే ఎరుగని 
తంపులన్ని పెడతుంటా
సాగదీసి కథనంతా
సన్యసాన్ని పురికొలుపుత .... 

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... . 

సమయానకూలంగా 
సందళ్ళను జోడిస్తా 
కథనం నా ఇష్టమే
వ్యసనంగా మార్చుతా …

చూస్తావా...చూడవా ... 
సమయాన్ని మాడ్చేస్తా
చెప్పుకో దిక్కుంటే 
ఒప్పుకో  లేదంటే....  

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని .... 
ఘల్లు ఘల్లు మోతలతో
గజ్జెల రవము ... 

సీరియళ్లునోయమ్మా 
సీరియళ్లుని ....  

No comments:

Post a Comment