అంతా భ్రాంతి
తేది : 02-01-2022
శీర్షిక : ఒక్క తరమేనా ...
కవిత సంఖ్య : 203
విశ్వమంతా వీరలెవెల్లో కలియ తిరిగి
ముట్టుకుంటే ముత్యమై పట్టుకుంటే పగడమై
ధగధగల మెరుపులతో జిగినీలు కురిపిస్తూ
మనదేశం జగజ్జేయమానంగా శోభించాలని ....
కనులన్నీ కాయలుకాసే కలలెన్నో కని
వెదికి వెదికి వేసారి ... జల్లెడ గావించి
తాలు నాపలను తప్పించి ... మొక్కవోని
పిక్కటిల్లే దుక్కలాంటి పటుత్వం కోరి ....
లెక్కలేనన్ని అధ్యాయాలను చక్కాగా
రంగరించి విభాగాల వారీగా వివరించి
గులాబీలు కుమ్మరించి భలేగా ప్రజాస్వామ్య
పరిమళాలు జల్లించి చిలకరించాలని
కోరుకుని ఎదురుచూస్తుంటే ....
గట్టిగా ఒక్కటంటే ఒక్క తరానికి కూడా
గట్లు వేయలేక... కొన్ని విషయాల్లో...
వెల వెల బోతుంటే ...గొంతులో పచ్చి
వెలక్కాయ పడిన చందంగా .. చేతలుడిగి
చూస్తూ... కట్టి పడేసిన చేతులతో ..
నోరెళ్లపెట్టుకుని...నిలువు గుడ్లేసుకుని
చూడాల్సి వస్తుంది....
కల్లలు బాపి కలలు నెరవేరుస్తుందని
ఆశపడిందంతా భ్రాంతియేనా ....
కావలసిన మార్పులు చేర్పులతో
వారి తప్పులను ఎండకడుతూ
ప్రజలకు సంక్షేమాలు కట్టబెడతారంటే ...
వీరు కాపోతే వారు ... వారు కాపోతే వీరు ...
పాలనలన్నీ వాళ్ళ చేతుల్లోనే కాబట్టి
వాళ్ళ వాళ్లకు సంబదించిన పరిమితులు
మినహాయింపులు ససేమిరా ముట్టుకోమంటూ
తప్పొప్పుల తడకలు మరమ్మతులు
తప్పిస్తూనే ఉన్నారు ...
మీ ఇంటికి వస్తే ఏమిస్తావు ....
మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటున్న
రాజకీయ పార్టీల తత్వాలను చూస్తుంటే....
పేరు చెబితేనే ఒళ్ళంతా కంపరమేసి...
ముఖం చూడాలన్నా వల్ల కావడం లేదు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment