Saturday, February 10, 2024

నీకు తెలియని నేను తేది : 02-01-2022 శీర్షిక : బంధుత్వం లేని బంధాలం

 నీకు తెలియని నేను 

తేది : 02-01-2022
శీర్షిక : బంధుత్వం లేని బంధాలం 
కవిత సంఖ్య: సహస్రాధికం 

విశ్వమంతా విస్తరించిన  
వింత వింత బంధాలలో విలీనమే....
విచిత్రంగా మనిషికి మనిషి తెలియకున్నా 
గమ్మత్తుగా ఉత్పత్తుల సేవల ఉడతాభక్తి .... 

బంధుత్వాలు ఎరగని బంధాలతో 
హలం పట్టి పొలం దున్నడమే.... 
కులమతాల  పట్టింపులెరుగని 
సర్వ మతాదరణే తాత్వికమంటూ... 

నిమ్మకు నీరెత్తిన నిష్కర్షల విధానాలతో 
జాలి దయల జాతికి దూరంగా 
నకిలీలను నాకు పరిచయం చేసి 
పంట దెబ్బ కొట్టి ఒంటరిని చేసిన వారికైనా 
పట్టెడు మెతుకులను సాదరంగా అందిస్తా .... 

బంధమెరుగని బంధుత్వాలతో  
కంటికి రెప్పలా కాపాడడమే  ... 
ధనిక పేదల తారతమ్యమెరుగక 
కంచెల దగ్గర కాపలా పహారాలు...   

కనిపెంచిన వాళ్ళను ....కట్టుకున్న 
వాళ్ళను ... కన్నపిల్లలను .... 
కడుదూరం పెట్టైనా ... కళ్ళల్లో 
కాంతి వెలుగులు నింపుకుని
కవాతు చేస్తుంటాము .... 

బంధమెరుగదు బంధుత్వమెరుగదు .... 
వేలుకు సిరా పూయించుకుని 
గెలుపులకు పోరాడిన యోధులం .... 
కాలికి బట్ట కట్టుకుని తిరిగినా 
కనికరించని  స్వార్థ తత్వాలలో 
కనపడని  ఒంటరి ప్రయాణీకులం .... 
లక్షల్లో లక్షణమైన ప్రజలం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment