అలజడుల ఆవాసాలు
తేదీ 31-01-2023
శీర్షిక : నాగరికతకు అవతలి తీరం
కవిత సంఖ్య : సహస్రాధికం
నాగరికతలకు అవతలి తీరం
నదీమతల్లుల ఒడిలో సేద దీరే మాలోకం ...
పూటల కొద్దీ పస్తులున్నా సరేగాని
మాటలు పోనీయని పెద్ద తనం ....
భూమి పుట్టా.... మాతృ సమంగా
చెట్టు చేమ ..దగ్గరి చుట్టంలాగా
వాగు వంకలు ... వరసైన బంధు మిత్రులుగా
పశువు పక్షి ....రాయి రప్పయినా
గుట్ట బోరైనా ... ప్రాణ మిత్రులుగా
సల్లగుండాలని కోరుకునే మనస్తత్వం ...
నడిచి నడిచి నాగరికత.....
నదీమ తల్లి సిరులను చూచింది ....
పుచ్చ పువ్వులా వెలిగి పోతున్న
పచ్చని లోకం చూడగానే ...
కళ్ళల్లో నిప్పులు పోసుకుంది .....
రాయి రప్పలను చూడంగానే
స్వార్థం బుసలు కొట్టింది ....
ఇంకేముంది....ప్రజలందరి పేరు
చెప్పి పంచాయితీ పెట్టింది ...
ప్రభుత్వం దఖలు పరిచిన ఫత్వాలను
చూపించి ... డొక్క నిండని బక్కోడని
చూచి వెక్కిరించింది ...బలాన్ని బలగాన్ని
నడిపించి... బంగళాకు దారి వేసింది ...
అత్యాశల గుర్రాలను రంగంలోకి
దింపి అంతా తానేనని ఢంకా బజాయిస్తూ
అక్కరలేకున్నా అలజడులకు
ఆజ్యం పోస్తున్నది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment