ఎప్పుడెప్పుడా అని
తేది: 07-02-2023
శీర్షిక :
ఆధునిక పూరిళ్ళు
సంఖ్య : సహస్రాధికం
ఆ వాకిటంతా కోలాహలమే ....
ముడుతలు పడిన శరీరాలతో
సరిగ్గా వినపడీ వినపడక పోయినా ...
మళ్ళీ మళ్ళీ అడుగుకుంటూనైనా
ముచ్చటలంటే మూతి చాపే శాల్తీలు ....
మూలుగుతూ ముక్కుతూ మూడు కాళ్లతో
తంటాలు పడుతూ లేస్తూ పచార్లు
కొడుతూ పక్కవారి యోగ క్షేమాలు
అడిగి తెలుసుకుని ఆనందిస్తూంటారు ....
జారిపోతున్న కళ్లజోళ్లను సరిచేసుకుంటూ
చిట్లించిన కళ్ళతో బంధాల తాలూకు
తీగలకోసం... అల్లంత దూరాలను తేరిపార
చూస్తూనే .... వాలిపోతున్న పొద్దులు....
చేజారిపోతున్న ఆత్మీయతలను
చీర చెంగున ముడి వేసుకున్న తీరున
తడిమి తడిమి తండ్లాడుకుంటూ చూసుకుని
పొగిలి పొగిలి ...లోలోపలి మాటలతోనే
కుములుకుని ... చంపలపై జాలువార్చుకునే
చాదస్తపు శాల్తీలు ....
కడుపులు కట్టుకుని ... కపటత్వం
లేకుండా.... కన్నవారికి కడుపులు
నింపిన స్వార్థమెరుగని సరంగులు ...
కర్మ కాలి కాలు కాలిన పిల్లులై ... కలియ
తిరుగుతున్నారు ....
మానవ బంధాలను మలినపరుస్తూ
ఆర్థిక బంధాలే అంతా అనుకుని
అర్రులు చాపుతున్న పిల్లల అమ్మలు....
అయ్యలకు ఆశ్రయం ఇస్తున్న
ఆధునిక పూరిళ్ళు ...వృద్ధాశ్రమాలు....
ఎంతోమంది ఎపుడెపుడా అని
ఎదురుచూస్తూనే ఉన్నారు ....
ఇకనైనా ఇలాంటి వృద్ధాశ్రమాల
సుద్దులు సద్దుమనగాలని ...
కడుపుల పెట్టుకుని చూసుకునే
కన్నబిడ్డల ప్రేమలో తరించాలని ...
ముసలి కళ్ళల్లో కాంతులీనాలని ....
అతి త్వరలో ఆశ తీరుతుందని ....
అందరి ఆశయం నెరవేరుతుందని...
ధనాత్మకంగా ఎదురుచూద్దాం....
No comments:
Post a Comment