చిత్రకవిత
తేది : 31-08-2020
శీర్షిక: సాంకేతిక సౌరభం.
సంఖ్య : 503
అమ్మలకు హడావుడి లేదు
అయ్యలకు పరుగు పయనం లేదు
పాఠ్య పుస్తకాల బరువులు లేవు
నోటుబుక్కుల్లో రాతలు లేవు....
నల్ల బల్లలు నారాజయినయి
తెల్ల బలపాలు మోటైపోయినయి
ఆట మైదానాల ఊసే లేదు
బడి బంగళాల జాడలు లేవు ......
కలం కాగితాల గలాటా లేదు
కళ్లన్నీ కంప్యూటర్ తెరలకే
చెవులన్నీ వినికిడి సాధనాలకే
గురువైన గూగులమ్మ గుసగుసలకే ....
మనిషి జీవిత గమనాన తరానికో
మార్పు సహజమే అయినా ...
మహమ్మారి మర్మంతో
ఉలుకు పలుకు లేకుండానే
ఉలిక్కిపడి నిలిచిన సాంకేతిక సౌరభం ...
మార్పులోని మర్మాన్ని నేర్పుగా
పసికట్టి ఓర్పుగా ఒడిసి పట్టి...
మానవీయత మరుగున పడకుండా
విజయ బావుటా ఎగరేయడమే
మన ధ్యేయంగా, గమ్య తీరంగా మలుచుకోవాలి.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment