Thursday, April 18, 2019

మానసిక ప్రశాంతత

అంశం : మానసిక ప్రశాంతత
తేదీ: 24 -12 -2018
శీర్షిక : తనువుతో మానసిక ప్రశాంతత
సంఖ్య : 109

ఆటపాటలతో ఎరుమేళిలో బయలెల్లి
అవని అంచులు తాకే కొండా కోన దాటుకుని
అళుదా చేరి కొంత అలసట తీర్చుకుని
చెరియానవట్టం, వల్లియానవట్టం మీదుగా
అపర గంగ పంబ చేరి అలుపు తీర్చుకున్నాము

శరణు శరణు స్వామి శరణమంటూనే
కాళైకుట్టి, కరిమళ, నీలయిక్కల్ పర్వత రాజులను
దట్టమైన అరణ్యాలు ధాటిగా దాటుకుంటూ
దండిగా కొలువైన స్వామి దర్శన భాగ్యము కావాలని........

అరువది కిలోమీటర్ల  కాలినడక
అడుగు తీసి అడుగు వేయలేని రాళ్లు రప్పలు,
ముళ్ల పొదలు, కటిక చీకటి,  కానరాని మార్గము
గురుస్వామి, తోటి స్వాములకు దూరంగా....
అయ్యప్ప శరణం తప్ప అన్యపు ఆలోచనలేని శరణుఘోషతో... 
అలసి సొలిసిన దేహ బాధలు
అలితేరే చలి పులి పంజా !

అయినా ! అలవోకగా జరిగింది యాత్రంతా
ఆత్రంగా కలుసుకున్నాము అందరమూ...
అయ్యప్ప జ్యోతి దర్శనానికి తొందర....
క్షణకాలం దొర్లడమే ఘనమనిపించింది.

అనుకున్న సమయామాసన్నమైనది
ఆరు ఇరువది సాయంత్ర  ప్రాంతములో
ఆకాశాన తిరిగెను పక్షిరాజులు
అరుదెంచిన  స్వామి ఆభరణాలతో

కొండల నిండా పడిగాపుల స్వాములు  
కుంభించి నిలిపిన శ్వాసలతో....  
అంబరమంటిన  శరణు ఘోష....  
ఆత్మ నింపెను మకర జ్యోతి దర్శనం.... 

పరుగు లేని ప్రశాంత చిత్తంతో 
పదే పదే అయ్యప్పను కోరింది.... 
చాలు దేవా ఈ జీవితం.... 
ఇంతకన్నా ఇంకేమి ఆశించనంటూ....  
జలజల రాలినవి  ఆనంద బాష్పాలు

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment