Thursday, April 18, 2019

మనుగడ

అంశం: మనుగడ
తేది: 06-03-2019
సంఖ్య: 146


యుగ యుగానికి ఆయుష్షు మారుతుందంటే 
ఏమిటో అనుకున్నా.....

మనుగడ ఆరాటంలో మితి మీరిన 
మానవ స్వార్థ పోరాటం... 

బ్రతుకు బ్రతుకనియ్యు ధర్మం. 

బుడత బ్రాహ్మడు బ్రహ్మాండమై
విశ్వపు ఆనవాళ్లను చుట్ట చుట్టినట్టు 
మనిషి స్వార్థం మహా వటవృక్షమై 
కనుచూపు మేర కనిపించే 
చెట్టు పుట్ట కొండ కోన వాగు వంకల  
ఆనవాళ్లు గల్లంతు చేసి గొల్లుమంటున్నాడు...
పర్యావరణ కాలుష్య పాప పంకిలానికి
పసిడి దారులేస్తున్నాడు....

అనంత జీవకోటికి ప్రాణాధారమయ్యే 
అమ్మలాంటి అమృతమూర్తి 
పచ్చ తివాచిగ పరచుకుని 
అన్నపూర్ణగ ఆదుకుంటున్న 
అవని మాతను .....
జల సిరులను పంచే 
జీవ గంగలను అపహాస్యం చేస్తూ...
అవని అంతరంగాన అలలు సృష్టిస్తూ 
అవసరానికి మించి ధాతు, వాయువులను 
అరాచకంగా పెకలిస్తూ 
పైశాచికానందంతో ఇకిలిస్తున్నాడు. 

మంత్రదండంతో మాయమయ్యే 
మతలబులాగా........ 
గుల్ల అవుతున్న భూగోళం 
ఫక్కున నవ్వి చటుక్కున మాయమయ్యే
రోజు ఎంతో దూరం లేదు సుమా .... 

బ్రతుకనియ్యకపోతే బ్రతుకే / మనుగడే లేదు మిత్రమా..... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment