అంశం : సెలయేరు
తేదీ : 06 -02 -2019
శీర్షిక : మంచినీటి చెలిమె
సంఖ్య: 139
ఊరూరి పిల్లకాల్వలు
ఊర్లన్నీ తిరిగి తిరిగి
వాగు వంకలై
మా ఊరు వచ్చింది వయ్యారంగా
సిల సిలా అంటూ మురిపంగా
సెలయేరు అయ్యింది చిత్రంగా
మంచినీటికి చెలిమెలయ్యింది
పంటనీటికి చేయూతనిచ్చింది
పైరగాలికి పచ్చని పైట వేసింది
పశువులకు మేకలకు మేత నిచ్చింది
తన గట్టున మనకు వనభోజనాలు పెట్టింది
చెరువు కుంటల్ల నీళ్లు నింపింది
చేపలకు తావై చేతివృత్తులనిచ్చింది
చెట్టు చేమకు తోబుట్టువయ్యింది
బావుల్ల నీళ్లు నింపి బతుకు నిలిపింది
భూగర్భ మట్టం పెంచి నిలిచింది
గంగమ్మ తల్లికి పిల్లగా వెలసింది
గౌరి పూజల్లోన గొలుసు కట్టై నిలిచింది
చాకి రేవులకు తావై చావు పుట్టుకలకు కేంద్రమయ్యింది
అన్నింటా తానై మనిషి ఆర్తులు తీర్చింది కానీ ....
మనిషేమో నిలువునా చీల్చేసి
ఇసుకంతా లాగేసి బండరాళ్లను సైతం
పెకలించి వేసి మాఫియాలను పెంచి పోషించి
మాయ జెసి మలినాలను నింపేసి
కాలుష్య కాసారంగా మార్చేసి
కాలయముడౌతున్నాడు....
కడకు తన ఉనికికే
ఎసరని తెల్సుకోలేకపోతున్నాడు ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment